కియా మోటార్స్‌ లొల్లి

- February 06, 2020 , by Maagulf
కియా మోటార్స్‌ లొల్లి

చెన్నై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్‌లో లేమని.. వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి.. ఏపీ పరిశ్రమల కార్యదర్శికి ఫోన్‌ చేసి మాట్లడినట్లు సమాచారం. కాగా కియా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిస్తున్నారంటూ రాయిటర్స్‌ పేర్కొన్న కథనాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. కియా మోటార్స్‌- ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పష్టం చేశారు. అదే విధంగా కియా మోటర్స్‌ సైతం రాయిటర్స్‌ కథనాన్ని ఖండించింది.

కియా మోటార్స్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కియా మోటార్స్ విషయంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని తమిళనాడుకి వెళ్లే తరుణంలో.. దానిని ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు. కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు నాయుడు కృషి ఏమాత్రం లేదని పేర్కొన్నారు. ఆయన హయాంలో సంస్థకు ఎలాంటి సహకారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడేమో కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని.. భవిష్యత్తులో మరో ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. కియా మోటార్స్ గురించి పార్లమెంట్ లోపలా, బయటా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com