'దిశ' పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్

- February 08, 2020 , by Maagulf
'దిశ' పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్

 

రాజమహేంద్రవరంలో 'దిశ' పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు కూడా పాల్గొన్నారు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా దిశ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో (రాజమండ్రి) 'దిశ' మహిళా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా జగన్ ప్రారంభించనున్నారు.

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళలకు ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆమె వివరించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీళ్లంతా 24 గంటలూ... మహిళల భద్రత కోసం పనిచేస్తారు.

దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదైనా... అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి... సరైన సాక్ష్యాధారాలు ఉంటే... దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కేంద్రం తాజాగా దిశ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఆ చట్టాన్ని ఆమోదించకుండా తిరిగి ఏపీకి పంపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com