సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేక తీర్మానం..దేశంలో తొలి కార్పొరేషన్‌గా రికార్డు..

- February 09, 2020 , by Maagulf
సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేక తీర్మానం..దేశంలో తొలి కార్పొరేషన్‌గా రికార్డు..

హైదరాబాద్: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో వివక్షను, వేధింపులను ఎదుర్కొని మనదేశానికి వచ్చిన మైనార్టీ(హిందువులు, క్రిస్టియన్లు..) శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని పేర్కొన్నారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేక తీర్మానం
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకిస్తూ మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బల్దియా సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

దేశంలో తొలి కార్పొరేషన్‌గా రికార్డు..
దేశంలో ఓ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఏఏను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ పాలకమండలి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి సహకరించిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి మినీ ఇండియాను తలపిస్తోందని రామ్మోహన్ అన్నారు.

కేసీఆర్ స్ఫూర్తిగా..
సెక్యూలరిజానికి నిదర్శనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుని సీఏఏను వ్యతిరేకిస్తూ ప్రతిపాదించిన తీర్మానం చేసినట్లు తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల సీఎంలు, ఇతర పార్టీల నేతలను కలుపుకుని పోతామని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా 10 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ సభ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.
 
హైదరాబాద్ అభివృద్ధిపై మేయర్..
ఇది ఇలావుంటే, హైదరాబాద్ అభివృద్ధిపై మేయర్ బొంతు రామ్మోహన్ వివరించారు.
హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో టాయ్‌లెట్స్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. వీటి కోసం రూ. 50 కోట్ల వరకు నిధులను కేటాయించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణం కోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రెండు పడక గదుల కేటాయింపుల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని చెప్పారు. కాగా, 2020-21 సంవత్సరానికి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ సర్వసమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com