మరో కీలక పథకం ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం

- March 01, 2020 , by Maagulf
మరో కీలక పథకం ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశపెట్టింది. దేశంలో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించ డానికి రైతు నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 10 వేల రైతు నిర్మాణ సంస్థలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో FPOలను లాంఛనంగా ప్రారంభించారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా వ్యవసాయోత్పత్తి సంఘాలను మోదీ మొదలు పెట్టారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువ. మొత్తం రైతుల్లో వీరి సంఖ్య 86 శాతం వరకు ఉంటుంది. వీరంతా, సరైన గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు లభించక, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు సరిగా జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి FPOలు పనిచేయనున్నాయి. 2022 నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు.

ఇక ఉత్తరప్రదేశ్ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పీఎం కిసాన్‌ పథకం లబ్దిదారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందచేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ భారీ కార్యక్రమం అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. ఒకే ప్రదేశంలో అధిక సంఖ్యలో ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేయడం, చక్రాల కుర్చీలతో అత్యంత పొడవైన వరుసను ఏర్పాటు చేయడం సహా 5 అంశాల్లో గిన్నిస్ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com