వివేకా హత్య కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం

- March 11, 2020 , by Maagulf
వివేకా హత్య కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగించినట్లు స్పష్టం చేసింది. కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని.. ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు సీబీఐ ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పులివెందుల పీఎస్‌ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఎం జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణ ప్రభావం కేసుపై ఉండకూడదని సూచించింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 

2019 మార్చి 15న వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసు ఛేదించేందుకు ప్రభుత్వం మూడుసార్లు సిట్‌ వేసింది. అయితే 11 నెలలు గడుస్తున్నా హత్య కేసు తేలలేదు. ఇప్పటి వరకూ సుమారు 1,300 మంది అనుమానితులను సిట్‌ అధికారులు విచారించారు. ముగ్గురు అనుమానితులకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించారు. ఘటనాస్థలంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే అసలు హంతకులు ఎవరనేది సిట్‌ అధికారులు ఇంతవరకూ తేల్చలేకపోయారు. ఈ నేపథ్యంలో హత్య కేసుపై వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో 15 మంది అనుమానితుల పేర్లను పేర్కొన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com