విజయవాడలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌

- March 22, 2020 , by Maagulf
విజయవాడలో ఏప్రిల్‌ 14 వరకు 144 సెక్షన్‌

విజయవాడ: నగరంలోని ఓయువకుడికి కరోనా వైరస్‌ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్‌-19 నివారణకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కొవిడ్‌ లక్షణాలు ఉంటున్నాయని, వారు విధిగా నిబంధనలు, సూచనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూచనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం డీజీపీ చేశారు.

ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌: సీపీ
విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సీపీ తిరుమల రావు తెలిపారు. రేపటి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా సోకిన యువకుడికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని చెబుతున్నా వారికీ పరీక్షలు అవసరం. వారి కుటుంబ సభ్యులు బయటికి వస్తే వైరస్‌ విస్తరించే అవకాశం ఎక్కువ. మనకు మనం స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలి. విజయవాడలో కరోనా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 7995 2442 60. ఈ నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చు’’ అని సీపీ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com