కరోనా అలర్ట్:ఖతార్ లో కొత్తగా 279 పాజిటీవ్ కేసులు..నలుగురికి పెరిగిన మృతుల సంఖ్య

- April 06, 2020 , by Maagulf
కరోనా అలర్ట్:ఖతార్ లో కొత్తగా 279 పాజిటీవ్ కేసులు..నలుగురికి పెరిగిన మృతుల సంఖ్య

ఖతార్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా మరో 279 మందికి వైరస్ సోకింది. దీంతో ఖతార్ లో కరోనా బాధితుల సంఖ్య 1604కి పెరిగింది. కరోనాతో 88 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. దీంతో ఇప్పటివరకు ఖతార్ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. కరోనాను అడ్డుకునేందుకు శానిటైజ్ (పరిశుభ్రత) విధానాలను అనుసరిస్తున్నా, నిర్బంధాన్ని కఠినంగా అమలు చేస్తున్నా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే..విదేశాల నుంచి తిరిగి వస్తున్న పౌరులు, నివాసుల ద్వారా వైరస్ తీవ్రత పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ బారిన పడిన వారిని నిర్బంధం(క్వారంటైన్) లో ఉంచామని వారికి తగిన ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పించామని అధికారులు తెలిపారు. ఇక ఇవాళ మరో 3,806 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35,757 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com