కోవిడ్ ఎఫెక్ట్ :జరిమానా చెల్లించే వరకు ఎమిరేట్స్ ఐడి పొడిగింపు రద్దు

- April 09, 2020 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్ :జరిమానా చెల్లించే వరకు ఎమిరేట్స్ ఐడి పొడిగింపు రద్దు

యూ.ఏ.ఈ:కరోనా వైరస్ నియంత్రణలో యూఏఈ ప్రజలకు మరోసారి కొన్ని సూచనలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేలా జరిమానాలతో పాటు గుర్తింపు కార్డు పొడిగింపు ని నిలిపివేయాలని నిర్ణయించింది. కొత్త నిర్ణయాల ప్రకారం ఇక నుంచి స్టెరిలైజేషన్( సూక్ష్మజీవులను హతమార్చుట) సమయాల్లో ఎవరైనా పాదచారులు సరైన కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చి 'స్టే హోం' నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి ఎమిరాతి గుర్తింపు(ఎమిరేట్స్ ఐడి) కార్డుల రెన్యూవల్ ను రద్దు చేస్తారు. ఫైన్ చెల్లించిన తర్వాతే మళ్లీ పొడిగింపు చేస్తామని షార్జా పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. షార్జాలో లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు 120 పాట్రోలింగ్ టీమ్స్ సిటీలోని పలు ప్రాంతాల్లో గస్తీ కాస్తాయని ఆయన అన్నారు. పాట్రోలింగ్ టీమ్స్ రోడ్ల మీదకు వచ్చే జనాలను ఆపి ముందుగా వారి గుర్తింపు కార్డులను తీసుకుంటారని, ఆ తర్వాత వాళ్లు చెప్పే కారణం సరైనదిగా భావిస్తే సరే..అలా కాకుండా కుంటి సాకులు చెబుతున్నట్లు అనుమానిస్తే మాత్రం గుర్తింపు కార్డు నెంబర్ ఆధారంగా ఫైన్ రికార్డ్ చేస్తారని అధికారి వివరించారు. అలాగే రోడ్ల మీదకు వచ్చే వాహనదారుల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. డ్యూటీలకు వెళ్లేవారు, మెడికల్ రీజన్స్ తో బయటికి వచ్చే వారు మినహా మిగిలిన మోటరిస్టులకు నెంబర్ ప్లేట్ల ఆధారంగా జరిమానా విధిస్తామని షార్జా పోలీసులు హెచ్చరించారు. స్టెరిలైజేషన్ సమయాల్లో నిబంధనలు ఉల్లంఘించే వారెవరిని వదిలిపెట్టబోమని అన్నారు. ఒక వేళ పని చేసే ప్రాంతాల నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వారుంటే వాళ్లు తప్పనిసరిగా వర్క్ ఐడీని చూపించాలని షార్జా పోలీసులు స్పష్టం చేశారు. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూ.ఏ.ఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com