అమెరికాలోని భారతీయులకు తీపి కబురు..!

- April 15, 2020 , by Maagulf
అమెరికాలోని భారతీయులకు తీపి కబురు..!

అమెరికా:కరోనా వైరస్‌తో అమెరికా అల్లాడుతోంది. ప్రధానంగా అక్కడి సాఫ్ట్‌వేర్ రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో చాలా కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది భారతీయులు.. అమెరికాలో చిక్కుకుపోయారు. వీరందరికీ ఊరటనిచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. తన వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ క్రైసిస్ సమయంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామంది. ఈ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తుదారుడు సమర్పించాలని నోటిఫికేషన్లో తెలిపింది.

కోవిడ్-19 పరిణామాలతో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని, గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇండియా విజ్ఞప్తిపై స్పందించిన అమెరికా ప్రభుత్వం... ఈ నిర్ణయం తీసుకుంది. వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు... గడువు పొడిగింపు లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా బహిష్కరణ లాంటి పరిణామాలు కలగకుండా చూసుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే.. వారు అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com