దుబాయ్: స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఊరట..త్వరలోనే ప్రత్యేక విమానాలకు అనుమతి
- April 16, 2020
కరోనా వైరస్ సంక్షోభంతో యూఏఈలో చిక్కుకుపోయిన భారత ప్రవాసీయులకు ఎట్టకేలకు ఊరట కలిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వదేశానికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ప్రవాసీయులు, పర్యాటకులను ఇండియా తరలించేందుకు భారత పౌర విమానయాన నియంత్రణ అధికారుల నుంచి అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ లో మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నా..అంతకుముందే ఇండియన్లను స్వదేశానికి తీసుకువెళ్లేలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లోనే ప్రత్యేక విమానాలకు డీజీసీఏ నుంచి అనుమతి వచ్చే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. తరలింపులో భాగంగా ముందుగా గర్భిణిలకు, చిన్నపిల్లలకు, పెద్ద వయస్కులకు అవకాశం కల్పించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సూచనలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. లాక్ డౌన్ గడువు కన్నా ముందే ప్రవాసీయులు వారి వారి రాష్ట్రాలకు చేరుకున్నా..వారిని రిసీవ్ చేసుకునేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించింది. కేరళా ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐల కోసం అన్ని ఏర్పాట్లతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో ప్రత్యేక విమానాలకు అనుమతి ఇచ్చినా తమకు సమస్య కాబోదని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి వచ్చే ప్రవాసీయుల నిర్బంధం (క్వారంటైన్) కోసం 2,50,000 వేల నిర్బంధ గదులను సిద్ధం చేశామని కూడా వెల్లడించింది.
లాక్ డౌన్ పొడిగింపుతో మే 3 సాయంత్రం 6.30 గంటల వరకు కమర్షియల్ విమానాలు రద్దు చేసినా...కార్గో విమనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని డీజీసీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే ప్రత్యేక అనుమతులు ఉన్న విమానాల విషయంలోనూ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం యూఏఈ, గల్ఫ్ దేశాల నుంచి భారతీయుల తరలించేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు నడిపే అవకాశాలు ఉన్నాయని యూఏఈలోని భారతీయ అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అయితే..విమానాలు ఎప్పుడు ఉంటాయనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని కూడా వెల్లడించారు. అయితే..యూఏఈ నుంచి స్వదేశానికి వెళ్లాలని ఎదురుచూస్తున్న ఇండియన్ల నుంచి అధికారికంగా ఇప్పుడే ఎలాంటి దరఖాస్తులు స్వీకరించటం లేదని స్పష్టం చేశారు. విజిట్ వీసాదారులు, ఉద్యోగం కొల్పోయిన ప్రవాసీయులు, కరోనా సంక్షోభంతో స్వదేశానికి వెళ్దామని ఎదురు చూస్తున్న వారి కుటుంబాల నుంచి దాదాపు వెయ్యి వరకు వినతులు వచ్చాయని దుబాయ్ లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







