పాతికేళ్ళ నాటి గల్ఫ్ గాధ-ఎయిర్ లిఫ్ట్

- January 28, 2016 , by Maagulf

ఈ మధ్య రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా AIRLIFT చూశారా? గల్ఫ్ దేశాల్లో నివసించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తూ హైదరాబాదులోనో, వైజాగ్ లోనో జరిగే కధల సినిమాలని అక్కడి తెర మీద చూస్తున్నపుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, గల్ఫ్ లో నివసిస్తూ ఇక్కడి ప్రాంతాల్లో జరుగుతున్న కధని ఇక్కడి తెర మీద, అది కూడా మన జాతీయ భాషలో చూడటం సరిగ్గా అలాంటి అనుభూతినే కలిగిస్తుంది. 1990 ఆగస్ట్ 2 న ఒక లేబర్ కాంప్ పై జరిగిన మిస్సైల్ దాడి తో ఈ సినిమా కధ మొదలవుతుంది. అసలు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది, ఎలా ముగిసింది అనేది వేరే కధ.సినిమా కి సంభంధించినంత వరకు అది అప్రస్తుతం. నేను గతంలో కువైట్ లో సందర్శించిన కొన్ని ప్రాంతాల అనుభవాలు చెప్పిన తర్వాత ఈ సినిమా గురించి చెప్పుకుందాం.

దుబాయ్ లో పని చేస్తుండటంతో మా సంస్థకి సంభందించిన వ్యాపార కార్యకలాపాలు మధ్య ప్రాచ్యంలో ఉన్న ఒమన్ , కువైట్ , ఖతర్ , సౌదీ అరేబియా , బహ్రెయిన్ లలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడికి  బిజినెస్ ట్రిప్ వెళ్ళినా స్వామి కార్యం , స్వ కార్యం రెండూ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఆఫీసు పనులయ్యాక కనీసం ఒక్క రోజు ని అక్కడి విశేషాలని , చారిత్రక అంశాలని తెలుసుకోవటానికి పెట్టుకుంటాను. ఈ మధ్య అలాగే మొదటి సారి కువైట్ వెళ్ళాల్సి వచ్చింది. దుబాయ్ నుండి కువైట్ సరిగ్గా గంట నలభై నిమిషాలు ప్రయాణం. కువైట్ లో రెండు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దేశీయ , అంతర్జాతీయ విమానాలు కూడా వస్తాయి. కేవలం ఒక టెర్మినల్ మాత్రమే ఉన్న అతి చిన్న ఎయిర్పోర్ట్  షేక్ సాద్. మధ్య ప్రాచ్య దేశాల నుండి వచ్చే చిన్న విమానాలు అల్ సాద్ ఎయిర్ పోర్ట్ కే వస్తాయి. దుబాయ్ రెసిడెన్స్ వీసా కనుక ఉంటే గల్ఫ్ కౌన్సిల్ దేశాల్లో ఆగమానంతర వీసా తీసుకోవచ్చు. అల్ సాద్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. ఫ్లైట్ దిగగానే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ పక్కనే వీసా తీసుకునే సదుపాయం ఉంది. వీసా ఖరీదు 3 కువైట్ దినార్లు. ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ కువైట్ దినార్. మన డబ్బుల్లో ఒక దీనార్ కి 210 రూపాయలు వస్తాయి. మా గ్రామానికి చెందిన శ్రీ మూల్పూరి వెంకటేశ్వరరావు గారు గత ఎనిమిదేళ్లుగా కువైట్ లోనే పని చేస్తున్నారు. నేను వస్తున్నా అని చెప్పగానే ఆయన తీసుకున్న శ్రద్ధ అనిర్వచనీయం. నేను మొదటి సారిగా అక్కడికి వెళ్తున్డటంతో ఆయనే ఎయిర్ పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు. మా గ్రామానికి చెందిన శ్రీ ఎనిగళ్ళ  బాలకృష్ణ గారు కువైట్ లో స్థాపించిన తెలుగు కళా సమితికి 2 సార్లు అధ్యక్షులుగా పని చేశారు. గత 22 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారు.   

 ఈ దేశం పేరు వినగానే నాకు మొదట గుర్తొచ్చేది 1990 లో జరిగిన గల్ఫ్ యుద్ధం. కువైట్ లో రెండు నేషనల్ మ్యూజియం లు ఉన్నాయి. ఒక మ్యూజియం లో ఒకప్పటి కువైట్ నిర్మాణం , అప్పటి ప్రజల జీవన విధానం. నౌకల ద్వారా భారత దేశంతో జరిగిన వాణిజ్యం తో పాటు, తవ్వకాల్లో దొరికిన పురాతన వస్తువులు ప్రదర్శనకి ఉంచారు. 1958 లో తోలి అరబ్బీ పత్రిక ఇక్కడినుండే వెలువడింది. ఈ మ్యూజియం పక్కనే సైన్స్ ప్లానిటోరియం ఉంది. మేము వెళ్ళినపుడు కొన్ని స్కూల్ బస్సుల్లో పిల్లలు ప్లానిటోరియం చూడటానికి వచ్చారు. దీనికి దగ్గరలోనే ఈ దేశపు పార్లమెంట్ ఉంది. 1961 లో బ్రిటీష్ పాలన నుండి విముక్తి చెందాక 1963 లో కొత్త ముసాయిదా రాజ్యాంగాన్ని , పార్లమెంట్ ని ఏర్పరచిన మొట్టమొదటి గల్ఫ్ దేశం కువైట్.కువైట్ కి సౌదీ అరేబియా మరియు ఇరాక్ పొరుగు దేశాలు, రోడ్డు మార్గం ద్వారా ఈ రెండు దేశాలకి వెళ్ళవచ్చు. 1980 నుండి 1988 దాకా జరిగిన ఇరాక్ - ఇరాన్ యుద్ధంలో కువైట్ ఇరాక్ పక్షాన నిలబడింది. షట్ ఆల్ అరబ్ అనే  నది ఇరాన్, ఇరాక్ ల సరిహద్దు గుండా ప్రవహించి పర్షియల్ గల్ఫ్ లో కలుస్తుంది. ఈ నది గుండా వెళ్ళే జల రవాణా మార్గంపై హక్కుల వివాదం వల్లనే ఇరాన్, ఇరాక్ ల మధ్య ఎనిమిది సంవత్సరాలు యుద్ధం నడిచింది. 1980 కి ముందరి పరిస్ధితి యధాతధంగా కొనసాగాలన్న ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది.

కాని విచిత్రంగా 2 ఏళ్ల తర్వాత తమకి మద్దతు ఇచ్చిన కువైట్ పైనే ఇరాక్ దాడి చెయ్యటం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1990 నాటికి 18 ప్రావిన్సులు ఉన్న ఇరాక్ కి 19 వ ప్రావిన్సు గా కువైట్ ఏర్పడుతుందని సద్దాం హుస్సేన్ ప్రకటించాడు. స్వతంత్ర దేశంగా ఉన్న కువైట్ ని ఇరాక్ లో ఒక రాష్ట్రం గా కలుపుకోవాలన్నది సద్దాం కోరిక. కువైట్ గర్భం లో అపారంగా నిక్షిప్తమైన చమురు సంపద కూడా ఈ ఆశ కి కారణం.  ఆగస్టు 2 వ తేది 1990 ఉదయాన్నే, ఇరాక్ , లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది. ఆ యుద్ధానికి సంభందించిన విశేషాలన్నీ ఒక మ్యూజియం లో భద్ర పరిచారు. దీనిని కువైట్ హౌస్ ఆఫ్ నేషనల్ మ్యూజియం అని సద్దాం మెమోరియల్ అని కూడా పిలుస్తారు.కువైట్  హిస్టారికల్ మ్యూజియం చూశాక దానికి కొద్ది దూరంలోనే ఉన్న ఈ మ్యూజియం కి చేరుకున్నాం. అక్కడి గైడ్ మన తెలుగువాడే. చిత్తూరు కి చెందిన ఇస్మాయిల్ ఈ మ్యూజియం కి గైడ్. ఇక మా పని మరింత సులువు అయింది. ఇరాక్ ఆక్రమణ ని , ఆ తరువాత ఆరు నెలల పాటు సాగిన ఆ యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఆ ఉదంతాలన్నిటిని బొమ్మల రూపంలో పొందు పరిచారు.

 
మనం ఒక్కో ఘట్టాన్ని చూస్తున్నపుడు వాటి తాలూకు శబ్దాలన్నీ బాక్ గ్రౌండ్లో వినిపిస్తూ అక్కడ నిజమైన యుద్ధమే జరుగుతోందా అనే భావన ని కలుగ జేస్తుంది. ఒక్కో సంఘటన ఇస్మాయిల్ చెప్తుంటే మాకు ఒళ్ళు జలదరించింది. 1966 లో స్థాపించిన కువైట్ యూనివర్సిటీ ఈ దాడి లో పూర్తిగా ద్వంసం అయింది. ఆ సమయంలో యూనివర్సిటీ లో పాఠాలు చెప్పే టేబుల్ పైన పడిన ఒక బాంబు ని అక్కడ యధా తధంగా ఉంచారు. ఈ ఆక్రమణ లో వేలాది మంది కువైట్ పౌరులు మరణించారు. చాలా మంది జాడ తెలియలేదు. అమెరికా తో పాటు ఇతర దేశాలన్నీ ఈ ఆక్రమణ ని వ్యతిరేకిస్తూ తమ సైన్యాన్ని కువైట్ కి మద్దతు గా రంగంలోకి దించాయి. ఈ ధాటికి తట్టుకోలేక ఫిబ్రవరి 28, 1991 న ఇరాక్ దళాలు వెనక్కి మళ్ళాయి.అందుకే ఈరోజుని లిబరేషన్ డే గా కువైటీలు జరుపుకుంటారు. నేటికి యుద్ధం ముగిసి 25 ఏళ్ళు అయ్యింది. అయినా ఆనాటి సంఘటల్ని కువైటీ లు ఎన్నటికీ మర్చిపోరు. 

ఆ యుద్ధ సమయంలో కువైట్ లో ఉన్న 170,000 మంది భారతీయుల్ని ఒక పారిశ్రామిక వేత్త ఎలా ఇండియా కి తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా కధ. ఒరిజినల్ గా ఇది జరిగింది. ఒక మలయాళీ పారిశ్రామిక వేత్త మరికొందరి సహకారంతో 170,000 మందిని కువైట్ నుండి ఇరాక్ మీదుగా 2000 కిలోమీటర్ల రోడ్ ప్రయాణం ద్వారా జోర్డాన్ బోర్డర్ దాటించి భారత ప్రభుత్వ సహకారంతో 488 ట్రిప్పులలో ఎయిర్ ఇండియా విమానాల ద్వారా అందరినీ భారత్ కి చేర్చారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆపరేషన్. గిన్నిస్ రికార్డులకి కూడా ఎక్కింది. అసలు ఇలాంటి కధని సినిమాకి వస్తువుగా ఎన్నుకోవటమే పెద్ద సాహసం. 1990 నాటి వాతావరణాన్ని సృష్టించటం అంత సులువేమీ కాదు. సినిమాలో వాడిన కార్లు, బస్సులు అన్నీ 1990 కి ముందున్న మోడల్స్. ఇంటి ఫర్నిచర్ దగ్గరనుండి ఫోన్లు , దుస్తులు అన్నీ 1990 నాటివే. కధ కువైట్ లో జరుగుతున్నా చాలావరకు సినిమా అంతా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రస్ అల్ ఖైమా లో సెట్స్ వేసి చిత్రీకరించారు.ఇప్పటికీ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూడండి. ఇది మన సినిమా , మనల్ని ప్రతిబింబించే సినిమా, మనం చూసి ప్రతిస్పందించగలిగిన సినిమా.. 


--రాజేష్ వేమూరి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com