నాయకుడిగా నన్ను తీర్చిదిద్దింది ఆ ఊరే: ఉపరాష్ట్రపతి

- May 10, 2020 , by Maagulf
నాయకుడిగా నన్ను తీర్చిదిద్దింది ఆ ఊరే: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంతూరి స్మృతులను నెమరు వేసుకున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభించి, ఒక నాయకుడిగా తీర్చి దిద్దిన ఉదయగిరి జ్ఞాపకాల్ని సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. తన బాల్య స్నేహితులు, రాజకీయ మిత్రులు, ఆప్తులు, ఉదయగిరి ప్రజలతో ఉన్న అనుబంధాల్ని అప్పటి స్మృతులను నెమరు వేసుకున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి నేడు భారత ద్వితియ పౌరుడి స్థాయికి ఎదగడానికి ఉదయగిరి అందించిన ప్రోత్సహాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు.

"రాజకీయ సోపానంలో మొదటి మెట్టు"

(ఉపరాష్ట్రపతి అయినా ఉదయగిరి స్మృతులు ఎప్పటికీ మధురమే)

ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే... జీవితంలో ఎన్నడుగులు ముందుకు వేసినా, ప్రారంభమైన చోటు మాత్రం చాలా విలువైనది. ఒక గింజ మొలకెత్తడానికి ఎంత తపన పడుతుందో, అంతే తపన మొదటి మెట్టు దగ్గర విజయాన్ని సాధించిన ప్రతి మనిషి పడతాడు. ఈ రోజు నేను ఉపరాష్ట్రపతిని. కానీ నా ప్రస్థానం ప్రారంభమైన చోటు మాత్రం “ఉదయగిరి”. ఒక సాధారణ విద్యార్థి నాయకుడు, ఏ మాత్రం పెద్దగా పరిచయం లేని పార్టీ, కానీ ప్రజల నమ్మకం, ముప్పవరపు వెంకయ్య నాయుడు గెలుపుగా మారి ఎమ్మెల్యేను చేసింది. అది మరచిపోలేని సందర్భం. ఉదయగిరి నా రాజకీయ సోపానంలో మొదటి మెట్టు. అక్కడి ప్రజలంతా నా వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎప్పటికీ మరపు రాని వ్యక్తులు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వీయ నియంత్రణ కారణంగా నియమనిబంధనలను అనుసరించి మిగతా ప్రజలందరితో పాటే భారతదేశ రెండవ పౌరుడిగా నేను కూడా ఇంటికే, ఏకాంత వాసానికి పరిమితం అయ్యాను. ఆలోచించే మనసు, సంభాషించే నోరు, పర్యటించే కాలు ఊరికే ఉండలేవని సామెత. ఒక్క ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలు తప్ప ఎప్పుడూ ఒక పట్టాన ఒక చోట ఉండడం అలవాటు లేదు. అలాంటి నాకు ఇదో కొత్త అనుభవం. అయితే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో, ఒక్క సారి పాత మిత్రులు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, సహచరులు... ఇలా అందరితో ఈ సందర్భంగా మాట్లాడాలని ఆలోచన కలిగింది. కలిగిందే తడవుగా వరుసగా ఫోన్ చేసి పలకరిస్తున్నాను. అందరితో ఫోన్ ద్వారా మాట్లాడుతుంటే పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి.

“కనెక్ట్ పీపుల్” కార్యక్రమంలో భాగంగా మొదటగా నేను రాజ్యసభ సభ్యులను, పార్లమెంటులోని వివిధ పార్టీల ప్రముఖ నాయకులను, తదుపరి నా రాజకీయ జీవితంలో నాటి సహచరులను, సీనియర్లను, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యుల్ని పలకరించాను. తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ లో ఉన్న అలనాటి, ప్రస్తుత పాత్రికేయ మిత్రులను పలకరించాను. ఆ తర్వాత కాలేజీల్లో, విశ్వ విద్యాలయాల్లో నాటి సహచరులు, వివిధ ఉద్యమాల్లో నాతో కలిసి పని చేసిన ఉద్యమ మిత్రుల క్షేమ సమాచారాలను కనుక్కున్నాను. ఆలాగే జీవితంలో వివిధ సందర్భాల్లో నేను కలిసిన వారు, సమాజానికి మార్గనిర్దేశ చేస్తున్న ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు, సహచరులు, అనుచరులు... ఇలా అందరినీ పలకరించగలగడం సంతోషంగా అనిపించింది. కొంత మంది కాలం చేయగా, మరి కొంత మంది నా వయసుకు చేరుకున్నారు. ఇంకొంత మంది కాస్త ముందుకు వెళ్ళి నాకంటే పెద్ద వయసులో ఉన్నారు. ఇదంతా కాల మహిమే.

నెల్లూరు వీధుల్లో నడయాడిన రోజులు, పాత కళాశాల జ్ఞాపకాలు, నాటి ఉద్యమాలు, లాఠీదెబ్బలు, అరెస్టులు ఇవన్నీ తలచుకున్నప్పుడు మనసు పులకరిస్తున్నది. ముఖ్యంగా నా జీవిత సోపానంలో ఉదయగిరి మొదటి మైలురాయి. నేను రాజకీయంగా విజయవంతం కావడానికి కారణం అక్కడి ప్రజలే. ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా, అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదగడానికి కారణం కూడా అక్కడి ప్రజలే. ఉదయగిరి నా రాజకీయ పునాది. మూడో సారి వివిధ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు కూడా ఉదయగిరి నుంచే పోటీ చేసి, మళ్ళీ గెలిచి ఉంటే, పరిస్థితి మరో రకంగా ఉండేదేమో. 1985లో ఆత్మకూరులో ఓడిపోకుంటే, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నేను ఎంతో అభిమానించే అటల్ జీ, అద్వానీజీల మధ్య కూర్చునే అవకాశం దక్కి ఉండేది కాదేమో. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజ్యాంగ బాధ్యతల్లోకి బహుశా రాగలిగి ఉండేవాణ్ని కాదేమో.

ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్ళలో ఉదయగిరి నియోజకవర్గంలో నేను పలకరించని మనిషి, అడుగు పెట్టని గడప, చేయి కడగని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.

ఎందుకంటే నేను ధనం ఖర్చు పెట్టి గెలవలేదు. 1978లో, 83లో అసెంబ్లీకి ప్రజలు గెలిపించి పంపించారు. 77లో రాష్ట్రంలో జనతాకు ఒక్క సీటే వచ్చినా ఉదయగిరి అసెంబ్లీ స్థానంలో మెజార్టీ ఇచ్చారు. 78లో జిల్లా మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం వీచినా ఉదయగిరి ప్రజలు నన్ను గెలిపించారు. అలాగే 83లో శాసనసభలో, పార్టీలో చురుగ్గా ఉన్న నన్ను ఓడించేందుకు నాటి అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా ప్రజలకు నా మీద నమ్మకం సడలలేదు. నా ప్రత్యర్థి వైపు ప్రచారం చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తరలివచ్చింది. ప్రజలంతా హెలికాఫ్టర్ చూడ్డానికి వచ్చారే తప్ప, వారి అభ్యర్థిని గెలిపించ లేదు. ఇక ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతున్నా, ప్రజలు నా మీద నమ్మకం ఉంచారే తప్ప, ఎన్టీఆర్ గాలి ఉదయగిరిని తాకలేదు. ఉదయగిరి ప్రజలంతా నన్ను తమ బిడ్డలా ఆదరించారు. అన్ని విధాలా నన్ను ప్రోత్సహించారు. అందుకే నేను కేంద్రంలో అధికార పార్టీ అధ్యక్షుణ్ని అయినా

, ఇద్దరు ప్రధానుల ప్రభుత్వాల్లో కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టినా, భారతదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపికైనా నా రాజకీయ జీవితానికి మేలి మలుపు అయిన ఉదయగిరి జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను అవలోకనం చేసుకోవడానికి మళ్లీ ఇప్పుడు అవకాశం వచ్చింది.

పెద్దలు  ధనెంకుల నరసింహం గ్రామగ్రామాన నన్ను 1977లో అందరికీ మొదట పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రజలు అలాగే హత్తుకుపోయారు. నేను విడిచి వచ్చే వరకూ ప్రచారంలో ఎవరి ఖర్చు వారిదే. వారి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు, ఎడ్లబండ్లు స్వచ్ఛందంగా తీసుకొచ్చేవారు. ఆరోజుల్లో ప్రతి ఊరి వారు వారే ఖర్చులు భరించే వారు. నేను గ్రామాలకు వెళ్తే స్వాగతించి, ఊరేగించి, రచ్చబండ, దేవాలయాల దగ్గరకు తీసుకెళ్ళి హారతి ఇచ్చి, కొబ్బరికాయ, తాంబూలాలు ఇచ్చి, శక్తి కొలది రూ. 200, రూ. 500 ఇచ్చి ఆశీర్వదించే వారు. కులాలకు, మతాలకు అతీతంగా వారంతా నన్ను ఆదరించే వారు. నేను తెలియకపోవడం వల్ల 77లో ఆదరించకపోయినా, తదనంతరం ముస్లింలు సైతం అధిక సంఖ్యలో అభిమానులు అయిపోయారు. ఉదయగిరి సర్పంచి శ్రీ మజీద్, స్టాంపుల గౌస్ మొహిద్దీన్, ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మంచి మద్ధతుదారులుగా నిలచి, ఆఖరికి అటల్ జీ ఉదయగిరి మీటింగ్‌కు మజీద్ అధ్యక్షత వహించే స్థాయికి నా పట్ల అభిమానం పెరిగింది. పర్యటనల్లో ఆ ప్రాంతాల్లో, గ్రామాల్లో బసలు, వారు చేసిన ఏర్పాట్లు, రుచికరమైన స్థానిక వంటకాలు, నా జీపుకు వారే డీజిల్ పోయించడం, వాగుల్లో దాట లేకుంటే జీపును నెట్టి గట్టుకు చేర్చడం... ఇలా ఆ జ్ఞాపకాలు మనసును ఆహ్లాద పరుస్తున్నాయి. చెంచురామయ్య,  జానకీరామ్, రాజమోహన రెడ్డి  నాతో తలబడినప్పటికీ, ఎప్పుడూ శత్రు భావన చూపించలేదు.

ఉదయగిరి నియోజక వర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఉదయగిరికి పేరు తేవడమే గాకుండా నాటి తాగునీరు, సాగునీరు, విద్యుత్, విద్యా సమస్యలు, రవాణా, రహదారి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించి చాలా వరకూ ముందుకు తీసుకెళ్ళగలిగాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com