కోవిడ్‌ 19: అల్ అయిన్ లో భారత వైద్యుడి మృతి

- June 08, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: అల్ అయిన్ లో భారత వైద్యుడి మృతి

అల్ అయిన్: కరోనా వైరస్‌ బాధిత పేషెంట్లకు వైద్య చికిత్స అందిస్తోన్న డాక్టర్‌ సుదీర్‌ రాంభావు వషింకర్‌ మృతి చెందారు. బుర్జీల్‌ రాయల్‌ హాస్పిటల్‌ - అల్‌ అయిన్‌లో ఆయన ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 61 ఏళ్ళ డాక్టర్‌ సుధీర్‌, మహారాష్ట్రలోని నాగపూర్‌కి చెందినవారు. శనివారం ఆయన మృతి చెందగా, ఆదివారం ఆయన అంత్యక్రియల్ని నిర్వహించారు. కరోనా వైరస్‌పై పోరాటంలో అలుపెరగని పోరు జరిపిన డాక్టర్‌ సుధీర్‌ మృతి పట్ల విపిఎస్‌ హెల్త్‌కేర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వృత్తిపట్ల ఎంతో నిబద్ధత కలిగిన డాక్టర్‌ సుధీర్‌, పేషెంట్లకు నిత్యం అందుబాటులో వుండేవారనీ, ప్రస్తుత పరిస్థితుల్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నారని సహచర వైద్యలు పేర్కొన్నారు. మే 9న ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. రెండ్రోజుల తర్వాత అల్‌ అయిన్‌ ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. విపిఎస్‌ హెల్త్‌కేర్‌ - అల్‌ అయిన్‌ రీజియన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ మీనన్‌ మాట్లాడుతూ, డాక్టర్‌ సుధీర్‌ మృతి తమ సంస్థకు తీరని లోటు అని చెప్పారు. 2018లో ఆయన వీపిఎస్‌ ఫ్యామిలీలో భాగమయ్యారనీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్నారని చెప్పారు అరుణ్‌ మీనన్‌. సుధీర్‌కి ఇద్దరు కుమారులు కాగా, ఇద్దరూ మెడిసిన్‌ అభ్యసిస్తున్నారు. విపిఎస్‌, డాక్టర్‌ సుధీర్‌ కుటుంబానికి అండగా వుంటుందనీ, వారి పిల్లల విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చుని భరిస్తామని డాక్టర్‌ మీనన్‌ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com