ఇ-బిజ్‌ వ్యవస్థాపకుడు యాసీన్ షరీఫ్‌ అస్తమయం

- June 19, 2020 , by Maagulf
ఇ-బిజ్‌ వ్యవస్థాపకుడు యాసీన్ షరీఫ్‌ అస్తమయం

దుబాయ్:కరోనా వైరస్‌.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ మహామ్మారికి పేద, ధనిక అన్న తేడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలకూ కరోనా వైరస్‌ వ్యాపించింది. గల్ప్‌ దేశాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యాసీన్ షరీఫ్(49)‌‌, కరోనా వైరస్‌ కారణంగా దుబాయ్‌లో మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేసింది. ఉన్నత విద్యనభ్యసించిన యాసీన్ షరీఫ్‌‌, తాను జీవితంలో ఉన్నతస్థాయికి చేరడమే కాదు, తనలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఎంతోమందికి సాయపడ్డారు. ఇ-బిజినెస్ గురించిన అవగాహన లేనివారికి, ఓ అన్నగా.. ఓ గురువుగా వ్యవహరించి.. వారికి ఆ రంగం పట్ల అవగాహన, ఆసక్తి కలిగేలా చేసేవారు. పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ‘ఇ-బిజ్‌’ సంస్థను నెలకొల్పిన యాసీన్ షరీఫ్‌‌ ఎందరికో ఉపాధి కల్పించారు. కానీ, దురదృష్టవశాత్తూ యాసీన్ షరీఫ్‌‌ని కరోనా వైరస్‌ బలిగొంది. కరోనా వైరస్‌ బారిన పడ్డ యాసీన్‌, వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.యాసీన్ షరీఫ్‌‌, ఆంధ్రప్రదేశ్‌లోని వరదయ్య పాలెం,చిత్తూరు జిల్లాకి చెందినవారు.ఆయనకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని అయన సోదరుడు షరీఫ్ మాగల్ఫ్ కు తెలిపారు.యాసీన్ షరీఫ్‌ మృతి పట్ల ఆయన సన్నిహితులు, బంధువులు, దుబాయ్‌లోని తెలుగు సమాజం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. పది మందికి సాయపడే చెయ్యి, ఇక లేదన్న విషయాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com