పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ,...

- June 22, 2020 , by Maagulf
పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ,...

న్యూఢిల్లీ: పూరీలోని జగన్నాథ స్వామి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్ సమీక్షించింది. పూరీ జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది.

అయితే, కేవలం పూరీలో మాత్రమే రథయాత్ర నిర్వహణకు అనుమతిస్తున్నామన్న ధర్మాసనం.. ఒడిశాలోని మరే ప్రాంతంలోనూ నిర్వహించరాదని స్పష్టం చేసింది. కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉన్నందున భక్తులు లేకుండానే కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్రను నిర్వహించుకోవాలని సష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండి, కరోనా వ్యాప్తి కట్టడిపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. కాగా, ఈ అంశంపై విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది. రథయాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరపు న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీం ధర్మాసనంకు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు.

కరోనా కారణంగా రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. జూన్ 18న ఇచ్చిన ఆదేశాలను పునర్ సమీక్షించాలని కోరుతూ కేంద్రం, ఒడిశా ప్రభుత్వం సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. జస్టిస్ బోబ్డే ప్రత్యేక ధర్మాసనం నాగ్ పూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com