ఖతార్:వర్కింగ్ అవర్స్ నిబంధనల ఉల్లంఘన..33 వర్క్ సైట్లు తాత్కాలికంగా మూసివేత

- July 19, 2020 , by Maagulf
ఖతార్:వర్కింగ్ అవర్స్ నిబంధనల ఉల్లంఘన..33 వర్క్ సైట్లు తాత్కాలికంగా మూసివేత

దోహా:వేసవిలో కార్మికుల పని వేళలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై వేటు పడింది. ఈ నెల 15, 16న నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 33 వర్క్ సైట్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. వేసవిలో కార్మికులు వేడి తాపానికి గురవకుండా వారి ఆరోగ్య సంరక్షణ కోసం కార్మిక, సాంఘిక మంత్రిత్వ శాఖ...మినిస్టిరియల్ డిసిషన్ నెంబర్ 16, 2007ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు కార్మికులకు విశ్రాంతి కల్పించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులు విశ్రాంతి తీసుకునే సమయంలో చల్లదనం కోసం ఏసీలు ఏర్పాటు చేయాలి, చల్లని నీరు అందించాలి, తేలికపాటి దుస్తులను కార్మికులు ఇవ్వాల్సి ఉంటుంది. నేరుగా ఎండ తగిలే ప్రాంతాల్లో పని పురమాయించొద్దు. కానీ, కొన్ని కంపెనీలు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు పట్టించుకోకుండా నిబంధనల ఉల్లంఘనకు పాల్పిడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ రంగంలో ఉన్న కంపెనీలు కార్మికుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశాయి. ఈ నెల 15, 16 నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన 33 వర్క్ సైట్లలో పనులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇదిలాఉంటే జూన్ 15 నుంచి జులై 16 మధ్యకాలంలో పలు ప్రాంతాల్లోని 173 వర్క్ సైట్లను మూసివేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com