అయోధ్యకు రావద్దు..ఇళ్లలోనే దీపాలు వెలిగించండి

- July 29, 2020 , by Maagulf
అయోధ్యకు రావద్దు..ఇళ్లలోనే దీపాలు వెలిగించండి

లక్నో: ప్రస్తుత పరిస్థితుల రీత్యా అయోధ్య లో ఆగస్టు 5న జరిగే రామాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి రావాలని ఎవరూ ఆరాట పడవద్దని శ్రీరామ్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు దేశ ప్రజలను కోరింది. ఆ రోజు సాయంత్రం అందరూ ఇళ్లలోనే ఉండి దివ్వెలు వెలిగించాలని సూచించింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 1984లో రామాలయ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఆలయ నిర్మాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

'భూమి పూజ జరిగే చారిత్రక సందర్భంలో అయోధ్యలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. శ్రీరామ జన్మభూమి ట్రస్టు కూడా అలాగే కోరుకుంటోంది. అయితే, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అలా చేయడం ఏమాత్రం సాధ్యం కాదు' అని ఆ ప్రకటన పేర్కొంది. కరోనా మార్గదర్శకాల ప్రకారం పరిమితమైన ఆహ్వానితులు, భక్తులతోనే కార్యక్రమం జరుగుతుందని, సమీప భవిష్యత్తుల్లో ప్రతి ఒక్కరూ అయోధ్యను సందర్శించవచ్చని చంపత్ రాయ్ తెలిపారు. రామాలయ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రజలు ఇళ్లలోనే ఉండి దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని ట్రస్టు సూచించింది. భూమిపూజ పవిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సాయంత్రం వేళ తమతమ ఇళ్లలోనే దీపాలు వెలిగించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com