వైఎస్సార్‌ చేయూత ను ప్రారంభించిన సీఎం జగన్

- August 12, 2020 , by Maagulf
వైఎస్సార్‌ చేయూత ను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి:మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ, విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, సీఎస్‌ నీలం సాహ్ని, తదితర అధికారులు హాజరు అయ్యారు. వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్లు లబ్ధిదారులు

ఈ పథకం ద్వారా  45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. బడ్జెట్‌లో వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు. 

కాగా.. చేయూత లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్‌ జీ, జియోమార్ట్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్‌ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మేలు జరుగుతుంది. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాధి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక  కార్యకలాపాలు పుంజుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com