అన్ని భారతీయ భాషలను గౌరవించుకుందాం, ప్రోత్సహిద్దాం:ఉపరాష్ట్రపతి

- September 14, 2020 , by Maagulf
అన్ని భారతీయ భాషలను గౌరవించుకుందాం, ప్రోత్సహిద్దాం:ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ:హిందీభాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అలాగని ఏ భాషనూ ఎవరిపైనా రుద్దాల్సిన అవసరం లేదని, ఏ భాషనైనా వ్యతిరేకించడం సరికాదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘వివిధ భాషలు, వివిధ ఆచారాలున్నా భారతదేశమంతా ఒక్కటే. మనమంతా ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టత’ ఈ సాంస్కృతిక గొప్పదనాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. 

సోమవారం హిందీ దివస్ సందర్భంగా మధుబన్ విద్యాసంబంధిత ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాల సమావేశంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఎవరి మాతృభాషను వారు నేర్చుకుంటూనే మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత పరాయి భాషలను నేర్చుకోవడంలో తప్పులేదన్నారు. ఎన్ని ఎక్కువ భాషలొస్తే అంత ప్రగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. హిందీ మాతృభాషగా ఉన్నవారు దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలను నేర్చుకోవాలి. హిందీయేతర రాష్ట్రాలవారు హిందీని నేర్చుకోవాలి. ఇతర భాషలోని పదాలను, సామెతలను నేర్చుకుంటుంటే.. ఆ భాష మాట్లాడే వారితో ప్రేమానురాగాలు పెంచుకోవడంతోపాటు సత్సంబంధాలు ఏర్పడతాయి. దేశ సమైక్యత సుదృఢం అవుతుంది’ అని ఉపరాష్ట్రపతి  సూచించారు. కరోనా సమయంలో తాను ఫోన్లో పలకరించిన వారికి, తనతో మాట్లాడిన వారికి.. తమది కాని మరో భారతీయ భాషను నేర్చుకోవాలని సూచించానన్నారు. ముఖ్యంగా పిల్లలు హిందీ, ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాలని చెప్పానన్నారు.

ఒక భాషను ఇతరులపై బలవంతంగా రుద్దడం సరికాదని.. అయితే ఏ భారతీయ భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్న ఉపరాష్ట్రపతి.. వివిధ భారతీయ భాషల్లో అద్భుతమైన జ్ఞానం, చక్కటి సాహిత్యం దాగుందని.. వీటిని తెలుసుకునేందుకైనా వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవడంపై యువత దృష్టిసారించాలన్నారు. 
1946లో మహాత్మాగాంధీ హరిజన్ పత్రికలో ‘ప్రాంతీయ భాషల పునాదులపైనే జాతీయ భాష నిలబడుతుంది. జాతీయ భాష, ఇతర భారతీయ భాషలు ఒకదానికొకటి పూరకాలే తప్ప వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. 1918లో మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించి, తన కుమారుడైన దేవదాస్ గాంధీని తొలి ప్రచారక్‌గా నియమించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

తన విద్యార్థి దశలో హిందీ వ్యతిరేక ఉద్యమాలను చూశానన్న ఉపరాష్ట్రపతి.. ఢిల్లీకి వచ్చిన తర్వాత జాతీయస్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ భాషను నేర్చుకోవలసిన ఆవశ్యకతను స్వయంగా గ్రహించానని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో హిందీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో హిందీ భాష పట్ల గౌరవభావాలున్నాయని.. ప్రాధాన్యత తెలియని కొద్దిమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

మాతృభాషలకు సరైన గౌరవం కల్పించేదిశగా నూతన జాతీయ విద్యావిధానంలో తీసుకున్న చర్యలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. కనీసం ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషలో కొనసాగించే విద్యావిధానం ద్వారా చిన్నారిలో మేధోవికాసానికి బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా మాతృభాష, తర్వాత ఇతర భారతీయభాషలు నేర్చుకున్న తర్వాత ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్ వంటి ఎన్ని భాషలు నేర్చుకున్నా మంచిదేనన్నారు. 

ఈ కార్యక్రమంలో అంతర్జాలం ద్వారా మధుబన్ ఎడ్యుకేషనల్ బుక్స్ సంస్థ సీఈవో నవీన్ రజ్లానీ, ఎన్సీఈఆర్టీ సభ్యులు ప్రొఫెసర్ ఉషా శర్మ, ప్రొఫెసర్ పవన్ సుధీర్, ఇంద్రప్రస్థ్ విశ్వవిద్యాలయ ప్రతినిధి ప్రొఫెసర్ సరోజ్ శర్మతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హిందీ అధ్యాపకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com