గాంధీజీ ఆదర్శాల పునరుజ్జీవనం తక్షణ అవసరం – ఉపరాష్ట్రపతి
- October 02, 2020
న్యూఢిల్లీ:ప్రపంచం ఎదుర్కొంటున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక పర్యావరణ సమస్యల నేపథ్యంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దిశానిర్దేశం చేస్తాయని, వారి ఆదర్శాల పునరుజ్జీవనం తక్షణ అవసరమని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సత్యం, అహింసతో పాటు గాంధీజీ పాటించి చూపించిన విలువలు కాలాతీతమైనవని, ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్ళ నేపథ్యంలో వాటికి మరింత ఔచిత్యం ఉందని తెలిపారు. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల రెండేళ్ళ వేడుకల ముగింపు సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐ.సి.డబ్ల్యూ.ఐ) ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. గాంధీజీ సిద్ధాంతాలు, ప్రపంచ వ్యాప్తంగా వాటి ప్రభావం అనే అంశం మీద రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 14 దేశాలకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు.
ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచం అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న ఉపరాష్ట్రపతి, 1918 నాటి స్పానిష్ ఫ్లూ నేపథ్యంలో పేదల సమస్యల గురించి అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత గురించి గాంధీజీ మాటలను తెలియజేశారు. స్వీయరక్షణ కోసం ప్రభుత్వం, వైద్యులు సూచించిన నిబంధనలు పాటించడమే కాకుండా, పేదల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండాలన్న మహాత్ముని సూచనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. కోవిడ్ 19 మహమ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద పెను ప్రభావాన్ని చూపిందన్న ఆయన, పేదవారికి సహాయం చేయడానికి, వారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి ఇదే సరైన సమయమని, ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకోవలసిన ఆవశ్యకతను ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.
“మానవత్వం మీద విశ్వాసం కోల్పోకూడదు, అదో మహా సముద్రం, అందులో కొంత మురికి నీరు చేరినంత మాత్రాన, సముద్రం మురికిగా మారదు” అన్న మహాత్ముని సందేశాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, సత్యం, అహింస మార్గాలతో పాటు మానవత్వం, సహజమైన మంచితనం సమాజానికి మేలు చేస్తుందని గాంధీజీ విశ్వసించారని, చెడు పనులు తప్ప చెడు మనుషులు లేరన్న వారి మాటలు అక్షర సత్యాలని తెలిపారు.
మహాత్మా గాంధీ జయంతిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అంహిసా దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, ఇది ప్రపంచ మానవాళి హృదయాల్లో మహాత్ముని శాశ్వత ముద్రను తెలియజేయడమే గాక, పురోగతికి శాంతి అత్యంత ఆవశ్యకమనే విషయాన్ని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.
సత్యం, అహింసా మార్గంలో ప్రపంచానికి ఓ నవ్య జీవన విధానాన్ని మహాత్మా గాంధీ పరిచయం చేశారన్న ఉపరాష్ట్రపతి, ఇవి భారతదేశానికి స్వరాజ్యాన్ని సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాయని, స్వేచ్ఛా సాధన దిశగా అనేక దేశాల ప్రజలను ప్రేరేపించాయని, మహాత్ముడు పరమపదించిన 72 ఏళ్ళ తర్వాత కూడా ఆ విలువలు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయని తెలిపారు. గాంధీజీ మరణం తర్వాత ప్రపంచం తీరుతెన్నులు మారాయని, హైడ్రోజన్ బాంబు అభివృద్ధి నుంచి వాతావరణ మార్పులు, ఉగ్రవాదం విసురుతున్న సవాళ్ళ మధ్య స్థిరమైన అభివృద్ధి కోసం అన్వేషిస్తున్న ప్రపంచం, అవాంఛనీయ సవాళ్ళ పరిష్కారాల కోసం ఎదురు చూస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో గాంధేయ ఆదర్శాలైన స్వస్థతో కూడిన స్పర్శ (a healing touch), మానవత్వంతో కూడిన స్పర్శ (a human touch), సామరస్య పూర్వకమైన స్పర్శ (a harmonious touch) లాంటివి ప్రస్తుత ప్రపంచానికి అవసరమని ఆయన పేర్కొన్నారు.
భూమి మన అవసరాలను తీరుస్తుంది గానీ అత్యాశలను కాదు అన్న మహాత్ముని మాటలను గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మహాత్ముని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పేర్కొన్నారు. మహాత్ముని సిద్ధాంతాలు, వారి సర్వోదయ బావన శాంతియుత, సుసంపన్నమైన భారతదేశాన్ని సాకారం చేస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోడీ త్రికరణ శుద్ధిగా నమ్మారని, అందుకే పరిశుభ్రతకు మహాత్ముడు ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నగరాలు, గ్రామాల లక్ష్యాన్ని సాకారం చేసేందుకు స్వచ్ఛభారత్ అభియాన్ ను ప్రారంభించారని తెలిపారు.
మార్టిన్ లూథర్ కింగ్, రవింద్ర నాథ్ ఠాగూర్, లియో టాల్ స్టాయ్ లాంటి వారు మహాత్మ గాంధీ గురించి, గాంధేయ వాదం గురించి తెలియజేసిన అనేక అంశాల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి, స్వావలంబన దిశగా ముందుకు సాగడానికి గాంధీజీ సిద్ధాంతాలను మార్గదర్శనాలుగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా, మయన్మార్, రష్యా, సింగపూర్, ఒమన్, శ్రీలంక, ఇటలీ, జర్మనీ, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, కోస్టారికా, ఉజ్బెకిస్థాన్, చైనాకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు