ఈ సారీ ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు...కోవిడ్ ప్రొటోకాల్
- October 06, 2020
తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగనున్నాయి. కిందటి నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్వహించారు. ఈ సారి ఆ తిరుమలేశుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా.. ఏకాంతంగానే ఈ ఉత్సవాలను జరుపుతామని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఈ ఏడాది అధికమాసం వచ్చినందున తిరుమలలో వెంటవెంటనే రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి వచ్చింది. కిందటి నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ నెలలో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని మరోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను చేపట్టడానికి సన్నాహాలు కొనసాగిస్తున్నారు. 15వ తేదీన అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 16వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా, మార్గదర్శకాలకు లోబడి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించడానికి పరిమితంగా భక్తులను అనుమతించనున్నారు. భక్తుల రాక, శాంతిభద్రతలను తిరుపతి అర్బన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు సంయుక్తంగా పర్యవేక్షించనున్నారు. తిరుమల కొండకు పరిమితంగా వచ్చే భక్తులకు కోవిడ్-10 పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిబంధనలకు లోబడి గదులను కేటాయిస్తామని స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇదివరకటితో పోల్చుకుంటే రోజువారీ కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గాయి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. చిత్తూరు జిల్లాలో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 65,585. ఇందులో 58,907 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 5,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మీద 680 మంది కరోనా బారిన పడి మరణించారు. అత్యధిక కరోనా మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదు అయ్యాయి. కరోనా మరణాల్లో చిత్తూరు తొలిస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో గుంటూరు, మూడు, నాలుగు స్థానాల్లో తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు