పర్యావరణ రక్షణ కోసం 'ఎర్త్‌షాట్‌' ప్రైజ్‌ తో బ్రిటన్‌ ప్రిన్స్ ముందడుగు

- October 12, 2020 , by Maagulf
పర్యావరణ రక్షణ కోసం \'ఎర్త్‌షాట్‌\' ప్రైజ్‌ తో బ్రిటన్‌ ప్రిన్స్ ముందడుగు

మానవుడి తప్పిదాల వలన మనం నివసిస్తున్న భూమికి ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. కాలుష్యాల వలన భూతాపం పెరగడం, భూగర్భజలాలు తగ్గిపోవడం జరుగుతున్నాయి. దీంతో పర్యావరణంలోనే ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక ఇది ఇలానే కొనసాగితే కొన్నేళ్లకు భూమిపై మానవుడి మనుగడ కూడా కష్టమవుతుంది. దీంతో గత కొన్నేళ్లుగా పలువురు శాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని రక్షించుకోవాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించేందుకు బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్‌ ముందడుగు వేశారు. ఎర్త్‌ షాట్‌ పేరిట ఓ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆయన ఆవిష్కరించారు.

ది రాయల్ ఫౌండేషన్‌తో కలిసి 50 మిలియన్ పౌండ్లు పెట్టి విలియమ్స్ ఓ ఫండ్ ఏర్పాటు చేశారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చే వారి కోసం ఎర్త్‌ షాట్‌ అనే ప్రైజ్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతిని కాపాడటం, పునరుద్ధరించడం.. గాలిని శుద్ధి చేయడం.. సముద్రాలను పునరుద్ధరించడం.. వ్యర్థరహిత ప్రపంచాన్ని నిర్మించడం.. వాతావరణాన్ని సమతుల్య పరచడం వంటి ఐదు విభాగాల్లో ప్రతి ఏటా ఐదుగురికి ఈ ప్రైజ్‌ని ఇవ్వబోతున్నారు. ఈ ప్రైజ్‌లో భాగంగా ఒక్కొక్కరికి 1 మిలియన్ పౌండ్లు(దాదాపుగా రూ.9.5కోట్లు) చొప్పున బహుమానంగా అందివ్వనున్నారు. వచ్చే పదేళ్లలో భూమి, పర్యావరణాన్ని మళ్లీ సాధారణ స్థితికి తేవడమే లక్ష్యంగా ఈ ప్రైజ్‌ను ఆవిష్కరించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ప్రిన్స్ విలియమ్‌ మాట్లాడుతూ.. భూమి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయి. ఒకటి మనం ఇలానే ఉంటూ భూమి కోలుకోని విధంగా నష్టం కలిగించడం. రెండోది మన శక్తి ఏంటో గుర్తించి పర్యావరణ సమస్యలను పరిష్కరించడం. వచ్చే పదేళ్లు మనకు పరీక్షా సమయం అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com