బ్యాంక్ దివాళా చట్టానికి యూఏఈ సవరణలు..సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం

- October 22, 2020 , by Maagulf
బ్యాంక్ దివాళా చట్టానికి యూఏఈ సవరణలు..సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం

దుబాయ్ :కరోనా తరహా మహమ్మారి ప్రబలినప్పుడు, ప్రకృతి విలయం సంభవించినప్పుడు, యుద్ధాల సమయంలో అనివార్యంగా ఏర్పడే ఆర్ధిక ఒడిదుడుకుల్లో వ్యాపార రంగానికి ఊతం ఇచ్చేలా యూఏఈ ప్రభుత్వం బ్యాంకు దివాళా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. దాదాపు 50 ఏళ్ల కాలన్ని దృష్టిలో పెట్టుకొని మానవాతీత సందర్భాల్లో ఏర్పడే సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్ధిక రంగం తిరిగి నిలదొక్కుకునేందుకు వెసులుబాటు కల్పించటమే లక్ష్యంగా బ్యాంకు దివాళా చట్టం 2006, డిక్రీ నెంబర్ 6ను సవరించింది. దీంతో ఇక నుంచి ప్రకృతి విపత్తులు సంబంధించినా, యుద్ధాల సమయంలో, మహమ్మారి కారణంగా ఆర్ధికంగా సమస్యల్లో చిక్కుకునే సంస్థలుగానీ, వ్యక్తిగత రుణగ్రహీతలనుగానీ ఆయా రుణదాత కంపెనీలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీలుండదు. అదే సమయంలో రుణాలు తీసుకున్న వారు
కూడా పూర్తిగా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందలేరు. అప్పులు ఇచ్చిన వారు నష్టపోకుండా, అప్పులు తీసుకొని కట్టకలేకపోతున్న వారిపై తీవ్ర ఒత్తిడి లేకుండా మధ్యేమార్గంగా సమస్య పరిష్కారం దిశగా చట్ట సవరణ అంశాలు ఉపయుక్తంగా ఉండనున్నాయి. ఒకవేళ బకాయి పడిన వ్యాపార సంస్థలు, వ్యక్తులు దాఖలు చేసే దివాళా పిటీషన్ లో వాస్తవికతపై విచారణ చేపట్టే కోర్టు..బకాయిపడిన సంస్థను, వ్యక్తిని డిఫాల్టర్ గా గుర్తించే బదులుగా కొన్ని వెసులుబాటులు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. బకాయిపడిన సొమ్ములో కొంత మేర మినహాయింపు ఇవ్వటం, బకాయిని వాయిదాల మేర చెల్లించేందుకు కొద్ది మేర గడువు పెంచటం, లేదా బకాయి పడ్డ సంస్థ, అప్పులు ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు పరస్పరం ఓ అవగాహనకు వచ్చి సొమ్ములో కొంత మేర చెల్లించేలా సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే సమయంలో సదరు వ్యాపార సంస్థను ఉన్నఫళంగా జప్తు చేసేందుకు వీలుండదు. సంస్థ ఆర్ధిక కార్యకలాపాల జోలికి వెళ్లకూడదు. ఇలా ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టున పడేందుకు అవకాశం ఇవ్వటం ద్వారా ఆర్ధిక రంగ పునరుద్ధరణకు దోహదపడినట్లు అవుతుందని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com