ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

- October 29, 2020 , by Maagulf
ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్:మూడు చింతల పల్లిలో ప్రత్యేక పూజల తర్వాత ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్‌తో తెలంగాణలో నవశకం మొదలుకానుంది..రాష్ట్రవ్యాప్తంగా 474 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఇకపై తహసీల్దార్లే జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ హోదాలో వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వెనువెంటనే రికార్డుల్లో మ్యుటేషన్‌ సైతం చేపడతారు. ధరణిలో తొలి దశలో నాలుగు రకాల డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయడానికి తహసీల్దార్లకు అనుమతినిచ్చారు. భూముల విక్రయాలు, భూపంపకాలు, వారసులకు భూములపై అధికారం, గిఫ్ట్‌డీడ్‌లను తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాణిజ్య అవసరాల కోసం మార్చే అధికారం కూడా తహసీల్దార్లకే కట్టబెట్టింది ప్రభుత్వం.

ధరణి ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేయనుండటంతో దీనికోసం 'తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌ పుస్తకం చట్టం-2020'ను అనుసరించి, రూల్స్‌ను మార్పు చేశారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు కల్పిస్తూ జీవో కూడా జారీ అయ్యింది. ధరణి రికార్డులనే ప్రామాణికంగా చేసుకొని ఇకపై రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో 1 కోటి 55 లక్షల ఎకరాల పట్టా భూముల క్రయవిక్రయాలన్నీ ఇక తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగనున్నాయి. అయితే తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే విధిగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిందే. స్లాట్‌ లేకుంటే రిజిస్ట్రేషన్‌ చెల్లదు. తొలుత ధరణి వెబ్‌సైట్లోకి వెళ్లి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ విభాగంపై క్లిక్‌ చేయాలి. మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ని కూడా వెబ్‌సైట్(http://portaldharani.telangana.gov.in‌)లో నమోదు చేసుకోవాలి. కొనుగోలుదారులు, రైతుల ఆధార్‌ కార్డులు, పట్టాదారు పాస్‌ పుస్తకం వివరాలు నమోదు చేసుకోవాలి. కుటుంబ సభ్యుల వివరాలు, కొనుగోలు చేసే విస్తీర్ణం, సర్వే నెంబర్‌ అన్నీ వివరాలు పొందుపరచాలి. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ, పాస్‌పుస్తకం, మ్యుటేషన్‌ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com