బైడెన్ కరోనా టాస్క్‌ఫోర్స్ కో చైర్మన్‌గా వివేక్ మూర్తి!
- November 08, 2020
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. రెండు రోజుల తీవ్ర ఉత్కంఠ మధ్య జో బైడెన్ పూర్తి మెజార్టీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అందరి దృష్టి బైడెన్ తీసుకోనున్న నిర్ణయాలపై పడింది. కరోనా వైరస్‌ను నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన జో బైడెన్ ప్రభుత్వం.. మరి కరోనా నివారణకు ఏం చేయబోతున్నది అనేది వేయి డాలర్ల ప్రశ్నగా ఉన్నది. ప్రస్తుతం శీతాకాలంలోకి ప్రవేశించడంతో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో.. దానిని ఎలా ఎదుర్కొంటారనే అంశంతో పాటు ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.
కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌ను సోమవారం ప్రకటించబోతున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే వెల్లడించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు భారత-అమెరికన్ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి నేతృత్వం వహించే అవకాశం ఉన్నది. అలాగే, మాజీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డేవిడ్ కెస్లెర్ సహాఅధ్యక్షులుగా ఉంటారని అమెరికా మీడియా భావిస్తున్నది. మరో రెండు రోజుల్లోనే టాస్క్‌ఫోర్స్ తమకు అప్పగించిన పనిలో నిమగ్రం కానున్నదని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కార్యాచరణ మొదలుపెడతానని, రానున్న రోజులలో ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకుంటానని తన తొలి ప్రసంగంలో బైడెన్ అమెరికా ప్రజలకు స్పష్టం చేశారు. 'సోమవారం శాస్త్రవేత్తల బృందంతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేస్తాను. వారు బైడెన్-హారిస్ కొవిడ్ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తారు. ఆ ప్లాన్ 2021 జనవరి 20 నుంచి అమలులోకి వస్తుంది' అని బైడెన్ ప్రకటించారు.
సెనేట్‌తో సవాల్
అమెరికాలో కీలక నిర్ణయాలు తీసుకునేందుక సెనేట్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు మెజార్టీ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భిన్నమైన కార్యాచరణ చేపట్టడం బైడెన్‌కు సవాల్‌గా మారనున్నది. ట్రంప్ ఇప్పటికే వ్యాక్సిన్ అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. రెండు ప్యాకేజీలను ప్రకటించారు. త్వరలో మరో ప్యాకేజీ కూడా సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఈ దశలో కరోనా వైరస్ కట్టడికి బైడెన్ ప్రభుత్వం మరింత ఎక్కువ కష్టించి పనిచేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. శీతాకాలం ప్రారంభం కావడంతో మరణాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. కాంట్రాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్వంటివి రాష్ట్రాల పరిధి నుంచి ఫెడరల్ ప్రభుత్వం చేతిలోకి తీసుకురావడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అత్యంత క్లిష్టమైన దశను అమెరికా ప్రజలు చూస్తారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూషన్ హెచ్చరించింది.
వివేక్ మూర్తి ఎవరు?
కర్ణాటకకు చెందిన 43 ఏండ్ల వివేక్ మూర్తిని.. యూకేలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డారు. 2014 లో అమెరికా 19 వ సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తిని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఈ పదవిని అధిష్టించిన మొదటి భారతీయ-అమెరికన్ ఇతను. అనంతరం ఆయనను ట్రంప్ ప్రభుత్వం పదవి నుంచి తప్పుకోవాలని కోరడంతో ఆ స్థానాన్ని ఖాళీచేయాల్సి వచ్చింది. బైడెన్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజారోగ్యం, కరోనా వైరస్ సమస్యలపై ఉన్నత సలహాదారులలో ఒకరిగా వివేక్ మూర్తి నియమితులయ్యారు. తన ప్రచార హెల్త్‌కేర్ టాస్క్‌ఫోర్స్ కోచైర్మన్లుగా కాంగ్రెస్ మహిళ ప్రమిళ జయపాల్తోపాటు వివేక్ మూర్తి నియమితులై గొప్ప సేవలందించారు. బైడెన్ ప్రభుత్వంలో వివేక్ మూర్తి ఆరోగ్య కార్యదర్శిగా ఉంటారని కూడా పలువురు భావిస్తున్నారు. బైడెన్‌కు మద్ధతుగా నిధుల సేకరణలో కూడా ఉత్సాహంగా పాల్గొన్న వివేక్ మూర్తి.. బైడెన్‌ను అమితంగా ఇష్టపడే వ్యక్తులలో ముందుంటారు. "నా తల్లిదండ్రులతో కలిసి విందు చేయడానికి ఇంటికి తీసుకురావడానికి నేను ఇష్టపడే వ్యక్తి జో బైడెన్. మా ఇంట్లో తయారుచేసిన మసాలా దాసా ఆయనకు వడ్డిస్తాను. అతను ప్రామాణికమైనవాడు. నిజమైనవాడు. తాను ఏమనుకుంటున్నారో చెప్తారు. అదే నేను అతడిని నిజంగా ప్రేమించేలా చేసింది. అతను తన మనసులో ఏముందో చెప్తారు. అతను నిజాయితీపరుడు. ఇది ముమ్మాటికి నిజం" అని వివేక్ మూర్తి.. బైడెన్ గురించి తన మనుసులో మాట చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు