ట్రంప్ రూటే సెపెరేటు..రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ని విధులనుండి తొలగింపు

- November 10, 2020 , by Maagulf
ట్రంప్ రూటే సెపెరేటు..రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ని విధులనుండి తొలగింపు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్‌ ‘మార్క్‌ ఎస్పర్‌ని తొలగిస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ఎస్పర్‌ స్థానంలో క్రిస్టోఫర్ సీ మిల్లర్ తాత్కాలిక రక్షణశాఖ కార్యదర్శిగా తక్షణమే బాధ్యతలు చేపడతారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అతను ప్రస్తుతం జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ‌‌క్రిస్టోఫర్‌ని ట్రంప్ కొనియడారు. జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్ర డైరెక్టర్‌గా సెనెట్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిందని తెలిపారు. ఇక ట్రంప్‌ నాలుగేళ్ల అధ్యక్ష కాలంలో ఎస్పర్‌ నాలగవ పెంటగాన్‌ చీఫ్‌గా పని చేశారు‌. బాధ్యతలు స్వీకరించిన 16 నెలల తర్వాత ఎస్పర్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. గతంలో పౌర అశాంతిని అరికట్టడానికి ఫెడరల్ దళాలను మోహరించాలని ఎస్పర్ ఒత్తిడి చేయడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హింస కొనసాగుతున్నప్పుడు అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను వేగంగా ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ ఉత్తర్వులను ఎస్పర్‌ నెమ్మదిగా అమలు చేశారు. దాంతో ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇక ట్రంప్‌ చర్యలు చాలామందికి షాక్‌ ఇచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోయారు. మరో 10 వారాలపాటు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ లోపు ట్రంప్‌ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరిని ఇంటికి పంపిస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల తీర్పును అంగీకరించని ట్రంప్‌ దానని కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎస్పర్‌ స్థానంలో నియమితులైన క్రిస్టోఫర్‌ మిల్లర్‌ దాదాపు 31 ఏళ్ల పాటు సైన్యంలో పని చేశాడు. 2001 అఫ్ఘనిస్తాన్‌లో, 2003లో ఇరాక్‌లో మోహరించిన ప్రత్యేక బలగాల్లో పని చేశాడు. రిటైర్‌మెంట్‌ తర్వాత ప్రభుత్వ రహస్య ఆపరేషన్‌లు, ఇంటిలిజెంట్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. 2018-2019లో అతను తీవ్రవాద నిరోధకత, ట్రాన్స్‌నేషనల్‌ థ్రెట్స్‌ విభాగంలో వైట్ హౌస్ సలహాదారుగా పనిచేశాడు. 2019 నుంచి ప్రత్యేక కార్యకలాపాల కోసం రక్షణ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com