డబ్బుంటే ఇదిగో ఇలా..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్‌

- November 17, 2020 , by Maagulf
డబ్బుంటే ఇదిగో ఇలా..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్‌

ఎన్ 95 మాస్క్ కొనాలంటేనే రేటు వందల్లో ఉందని ఒకసారి పడేసే మాస్కే బెస్ట్.. అయిదు, పది రూపాయల్లో వచ్చేస్తుందని చాలా మంది వాటివైపే మొగ్గు చూపుతున్నారు. కానీ రాజుకి డబ్బులకి కొదవేంటన్నట్లు అమెరికాలో నివసిస్తున్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్‌ని ధరించాలని ఉవ్విళ్లూరాడు. అనుకున్నదే తడవుగా బంగారం వర్తకుడిని పిలిచి మాస్క్ తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. మొత్తానికి 4నెలల సమయం తీసుకుని వజ్ర, వైఢూర్యాలు ఉపయోగించి 270 గ్రాముల బరువుండే మాస్క్‌ని తయారు చేసి ఇచ్చారు. దీని ధర 1.5 మిలియన్ డాలర్లు కాగా.. మన కరెన్సీలో చూస్తే రూ.11.2 కోట్లు. ఈ మాస్క్‌పై 3600 నలుపు, తెలుపు రంగు వజ్రాలను పొదిగారు. ఇంకా ఎన్-99 ఫిల్టర్‌ని కూడా అమర్చారు. వైవెల్ జ్యువెలరీ కంపెనీ ఈ మాస్క్‌ని తయారు చేసింది. మాస్క్ తయారీకి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్నారని చెప్పారు.. ఆయన పూర్తి వివరాలు వెల్లడించడానికి జ్యువెలరీ సంస్థ నిరాకరించింది. జెరూసలెం సమీపంలోని నగల తయారీ సంస్థ యజమాని లెవీ మాట్లాడుతూ.. డబ్బున్నా ప్రతిదీ కొనుక్కోలేం. ఖరీదైన కోవిడ్ మాస్క్ ధరిస్తే చుట్టుపక్కల వారి దృష్టిని ఆకర్షించవచ్చనేది కస్టమర్ అభిమతమై ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంత ఖరీదైన మాస్క్ ధరించడం సబబు కాదు.. కానీ కోవిడ్ కష్టకాలంలో మా ఉద్యోగులకు మాస్క్ తయారీ కోసం నాలుగు నెలల పాటు పని కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని లెవీ పేర్కొన్నారు. 25 మంది నిపుణులైన పనివాళ్లు ఈ మాస్క్ తయారీలో పాలుపంచుకున్నారని లెవీ ఆనందం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com