జీహెఎంసీ ఎలెక్షన్లు: ఘూటుగా స్పందించిన విజయశాంతి

- November 17, 2020 , by Maagulf
జీహెఎంసీ ఎలెక్షన్లు: ఘూటుగా స్పందించిన విజయశాంతి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందించిన ఆమె కేసీఆర్‌పై ఫేస్‌బుక్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని మేసేవారికి కాకుండా మేయరు అనే వారికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోంది.  

చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా... విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ  అందె వేసిన చేయిగా మారిపోయారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కేసీఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కేసీఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ ఓటర్లు ఈసారి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎంతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ మేయరు పదవి ఈ పర్యాయం "మేసేవారికి" కాక "మేయరు..." అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం’’ అని విజయశాంతి పోస్టులో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com