హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య

- November 30, 2020 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య
  • కోవిడ్ నేపథ్యంలో విమానాశ్రయాల పున: ప్రారంభం అనంతరం విమాన ప్రయాణీకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు సురక్షితమన్న నమ్మకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటూ, దేశీయ ప్రయాణికుల సంఖ్య నవంబర్ నెలలో 37,000 కు చేరింది.
  • అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణీకుల వైద్య పరీక్షలు ఇతర వాటి ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో భారత విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇంకా ప్రయాణికుల ఆరోగ్య ప్రొపైల్,  RT-PCR మెడికల్ రిపోర్టులను అడుగుతున్నా, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న కోవిడ్ టెస్టింగ్ కేంద్రం లాంటి వాటి కారణంగా, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నారు. 
  • మే 25 నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 3000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. నాటి నుంచి నవంబర్ లో రోజూ 30,000 మంది ప్రయాణికులకు చేరింది. ఇది విమాన సర్వీసులు పున: ప్రారంభం నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. విమానాశ్రయం తిరిగి ప్రారంభమైన రోజు నుండి నవంబర్ 23 వరకు 30 లక్షల మందికి పైగా ప్రయాణీకుల రాకపోకలు జరిగాయి.   
  • విమాన సర్వీసులు పున:ప్రారంభమైన మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ నుంచి రోజూ 40 విమానాల రాకపోకలు జరగ్గా, నవంబరులో ప్రతిరోజూ 260 దేశీయ విమానాల రాకపోకలు  జరిగాయి. విమాన సర్వీసులు పున:  ప్రారంభమైన మొదటి రోజుకు ఇది ఆరురెట్లకన్నా ఎక్కువ.
  •  విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి నవంబర్ 23 వరకు సుమారు 35,000కు పైగా దేశీయ విమానాల రాకపోకలు జరిగాయి.
  • ఇటీవల దేశీయ ప్రయాణికుల సంఖ్య ఒక రోజులో 37,000 ను తాకింది, దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తరువాత ఇదే  అత్యధికం. విమానాల రాకపోకల సంఖ్య ఒకే రోజు 284 ను దాటింది.
  • కోవిడ్‌కు ముందు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 55  గమ్యస్థానాలు ఉండగా, నవంబర్ 23నాటికి 51 గమ్యస్థానాలకు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మరో మూడు కొత్త దేశీయ గమ్యస్థానాలు – కోజికోడ్, ఇంఫాల్, జగదల్‌పూర్‌లకు కూడా సర్వీసులు ప్రారంభమై,  RGIA నుంచి ఇప్పుడు మొత్తం 54 దేశీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 
  • కోవిడ్ తర్వాత మొదటి 5 గమ్యస్థానాలలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు మరియు ముంబై ఉన్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దేశంలోని వివిధ విమానాశ్రయాలకు సేవలు అందిస్తున్న మొదటి 3 విమానయాన సంస్థలు - ఇండిగో, స్పైస్ జెట్ మరియు ఎయిర్ ఇండియా. 
  •  ప్రయాణికులంతా సురక్షితంగా ప్రయాణించే దిశగా GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) ఇటీవల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లోపలే కరోనా వైరస్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. దీని వల్ల నగరంలోకి ప్రవేశించే ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించగలుగుతారు. 
  • కోవిడ్ నమూనాలను పరీక్షించడానికి సేవలను అందించడానికి GHIAL, హైదరాబాద్ ఆధారిత NABL (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) మరియు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సర్టిఫైడ్ ఏజెన్సీ అయిన ‘మ్యాప్‌మైజీనోమ్’ (mapmygenome)తో ఒప్పందం చేసుకుంది. ఇది ప్రయాణికులు, ఎయిర్ పోర్ట్ సిబ్బంది కోసం 24 గంటలూ పని చేస్తుంది.
  • అక్టోబర్‌ నెలలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, ఆ పని చేసిన మొట్టమొదటి భారతదేశ విమానాశ్రయంగా నిలిచింది.
  • జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ, “విమాన ప్రయాణంపై పెరుగుతున్న ప్రయాణీకుల విశ్వాసానికి ఈ ముప్పై లక్షల మంది ప్రయాణికులు ఒక తార్కాణం. కోవిడ్‌కు పూర్వం ఉన్న కెపాసిటీలో 70% ఆపరేట్ చేయడానికి ప్రభుత్వం విమానయాన సంస్థలకు అనుమతించడంతో, జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక కాంటాక్ట్-లెస్ కార్యక్రమాలతో సురక్షిత ప్రయాణానికి సన్నద్ధమైంది. ఇటీవల విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షా సదుపాయంతో కూడా నెగిటివ్ RT-PCR రిపోర్ట్ సమస్య కూడా పరిష్కరించబడింది. స్థిరమైన పెరుగుదలతో, కార్యకలాపాలపరంగా త్వరలో కోవిడ్ పూర్వస్థాయికి చేరుకుంటామని మేము ఆశిస్తున్నాము”.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com