భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని ఫైజర్ విజ్ఞప్తి

- December 06, 2020 , by Maagulf
భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని ఫైజర్ విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ: తాము తయారు చేసిన కొవిడ్‌-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్‌ ఇండియా 'భారత ఔషధ నియంత్రణ జనరల్‌' (డీసీజీఐ)ని కోరింది. మాతృసంస్థ ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్‌లలో ఇలాంటి ఆమోదాలు పొందిన నేపథ్యంలో ఆ మేరకు దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని, భారత ప్రజలపై క్లినికల్‌ పరీక్షల నిర్వహణ ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని దానిలో కోరింది. భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. టీకా అందరికీ అందుబాటులోకి వచ్చేలా కేవలం ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందాలు ఉంటాయని ఫైజర్‌ స్పష్టం చేసింది. భారత్‌కు అవసరమైన డోసులను వీలైనంత త్వరగా అందించేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటామని తెలిపింది.

భారత్‌లో ఇప్పటి వరకు ఐదు వ్యాక్సిన్లు అడ్వాన్స్‌ దశలో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ రూపొందిస్తున్న టీకా మూడో దశ ట్రయల్స్‌ను సీరం నిర్వహిస్తుండగా.. దేశీయంగా భారత్‌బయోటెక్‌ తయారుచేస్తున్న వ్యాక్సిన్‌ కూడా మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. మరోవైపు తాము అభివృద్ధి చేస్తున్న టీకాకు మూడోదశ ప్రయోగాలు నిర్వహించేందుకు జైడస్‌ క్యాడిలా ఇటీవలే డీసీజీఐ నుంచి అనుమతి పొందింది. అలాగే, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్ ప్రారంభించింది. బయోలాజికల్‌ ఈ-లిమిటెడ్‌ తమ టీకా తొలి, రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com