ఏలూరు ఘటన: రక్తంలో లెడ్, నికెల్ ఆనవాళ్లు..తగ్గిన కొత్త కేసులు
- December 09, 2020
ఏలూరులో వింతవ్యాధికి గల కారణాలపై అధికారులు ఇంకా ఓ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే తాగునీరు కలుషితం అయిందనే అనుమానాలు మొదట్లో బలంగా వినిపించినా.. మున్సిపల్ వాటర్ వాడేవారు సహా. మినరల్ వాటర్ వాడిన వారు కూడా అస్వస్థతకు గురి కావడంతో అసలు విషయం అది కాదని తేలిపోయింది.
ఇక కూరగాయల సాగుకి వాడే రసాయనాలు, పాలకల్తీ అంటూ వార్తలొచ్చినా.. అన్ని ప్రాంతాల ప్రజలు అవే బ్రాండ్ పాలు వాడతారని చెప్పలేం, కూరగాయలు కూడా ఒకే దగ్గర కొనే అవకాశమే లేదు. సో.. ఇది కూడా ప్రధాన కారణంగా తేలడంలేదు.
ఇక చేపల వినియోగంపై కూడా అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వరదలకు చేపల చెరువుల్లోకి వరదనీరు వచ్చి చేపలన్నీ బైటకు కొట్టుకు రావడంతో.. వాటిని పట్టుకున్న కొంతమంది తక్కువ ధరకు విక్రయించారని, అవి తిన్నవారు అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. ఇలా రకరకాల పుకార్లు ఏలూరులో షికార్లు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అన్నీ అనుమానాలు మాత్రమే.
బాధితులందరి శరీరాల్లో ఉమ్మడిగా సీసం, నికెల్ లాంటి రసాయనాలు అధిక మోతాదులో కనిపించడం విశేషం. బాధితులనుంచి సేకరించిన రక్త నమూనాల్లో సీసం, నికెల్ వంటి లోహాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యుల పరీక్షల్లో వెల్లడైంది. వారి శరీరాల్లోకి ఈ పదార్థాలు ఎలా చేరాయన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పూర్తిస్థాయిలో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏలూరులో 22 ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో క్రిమిసంహాకర మందుల అవశేషాలను గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ చెబుతున్నారు.
వైరస్, బ్యాక్టీరియా నిర్థారణకోసం బాధితుల వెన్నెముకనుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్ టెస్ట్ ఫలితం కూడా నెగెటివ్ రావడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితుల శరీరాల్లో ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా లేవని తేలింది. ఇక కణజాల పరీక్షకోసం హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపిిన నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
ఏది ఏమయినా.. ఏలూరు ఘటన జరిగి రోజులు గడుస్తున్నా దానికి గల కారణం అంతు చిక్కకుండా ఉంది. కూరగాయల్లో క్రిమిసంహారక మందుల అవశేషాలు, నీటి కాలుష్యం అనేది ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే అసలు కారణం అయితే.. కుటుంబంలోని అందరు సభ్యులు అస్వస్థతకు గురికావాలి. కానీ ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరు మాత్రమే ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్య సిబ్బంది కానీ, నేతలు కానీ.. ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేకపోతున్నారు.
ఇక కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉండటం, బాధితులు కోలుకుని డిశ్చార్జి కావడంతో ఏలూరులో కలకలం కాస్త తగ్గింది. మంగళవారం రాత్రి సమయానికి 68 మంది బాధితులు చికిత్స పొందుతుండగా మొత్తం 497 మంది డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు కారణం ఏంటనేది తెలిస్తేగానీ.. ఏలూరు పూర్తిగా కుదుటున పడేట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









