కోవిడ్ వ్యాక్సీన్‌ను సంపన్న దేశాలు పేద దేశాలకు అందకుండా చేస్తున్నాయా?

- December 09, 2020 , by Maagulf
కోవిడ్ వ్యాక్సీన్‌ను సంపన్న దేశాలు పేద దేశాలకు అందకుండా చేస్తున్నాయా?

పేద దేశాలకు కోవిడ్‌ వ్యాక్సీన్‌ అందకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయని 'ది పీపుల్స్‌ వ్యాక్సీన్‌ అలయన్స్‌' ఆరోపించింది. 70 పేద దేశాలలో పదిమందిలో ఒకరు మాత్రమే వ్యాక్సీన్‌ను పొందగలుగుతారని ఆ సంస్థ చెబుతోంది.

అయితే, తాము తయారు చేసే వ్యాక్సీన్‌లో 64 శాతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందిస్తామని ప్రపంచంలో అందరికీ వ్యాక్సీన్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థ తెలిపింది.

తమ వ్యాక్సీన్‌ కోవ్యాక్స్‌ను 92 పేద దేశాలకు అందించేందుకు ఇప్పటికే ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.

ఈ వ్యాక్సీన్ ఏమాత్రం సరిపోదని, ఫార్మా కంపెనీలు తమ టెక్నాలజీని ఇతర కంపెనీలకు పంచి ఎక్కువ వ్యాక్సీన్ ఉత్పత్తి అయ్యేలా సహకరించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఆక్స్‌ఫామ్‌, గ్లోబల్‌ జస్టిస్‌ నౌలాంటి సంస్థలు అంటున్నాయి.

ధనిక దేశాలు ఇప్పటికే అవసరమైనదానికన్నా మూడింతలు ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేశాయని ఈ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఒక్క కెనడాను ఉదాహరణగా తీసుకుంటే తమ దేశ ప్రజలకు అవసరమైనదానికన్నా ఐదింతల వ్యాక్సీన్‌కు ఆ దేశం ఆర్డర్ ఇచ్చిందని వారు వెల్లడించారు.

ప్రపంచ జనాభాలో 14%శాతంగా ఉన్న ధనికదేశాలు, తయారుకాబోయే వ్యాక్సీన్‌లో 53శాతాన్ని కొనేశాయని తెలిపారు.

"నివసించే దేశం, జేబులో ఉన్న డబ్బు ఆధారంగా ప్రాణాధార వ్యాక్సీన్‌ను ఎవరికివ్వాలో నిర్ణయించడం సరి కాదు" అని ఆక్స్‌ఫామ్‌ సంస్థ హెల్త్‌ పాలసీ మేనేజర్‌ అనా మారియట్ వ్యాఖ్యానించారు.

"అద్భుతాలు జరిగితే తప్ప ప్రపంచంలోని ప్రజలంతా రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సీన్‌ను పొందడం సాధ్యంకాదు" అన్నారామె. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి వ్యాక్సీన్‌ తయారీ టెక్నాలజీని ఫార్మా సంస్థలు పంచుకోవాలని ఆమె సూచించారు.

ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రా-జెనెకా సంస్థలు తాము లాభాపేక్ష లేకుండా వ్యాక్సీన్‌ తయారు చేస్తున్నామని వెల్లడించగా, ఒక్క కంపెనీ తయారు చేసే వ్యాక్సీన్‌ ప్రపంచమంతటికీ సరిపోదని ఆక్స్‌ఫామ్‌లాంటి సంస్థలు వాదిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com