టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ మహిళా నేత దౌర్జన్యం:జగన్ సీరియస్..కలవాలంటూ ఆదేశం

- December 10, 2020 , by Maagulf
టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ మహిళా నేత దౌర్జన్యం:జగన్ సీరియస్..కలవాలంటూ ఆదేశం

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి ఉదంతం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఆమె చేయి చేసుకోవడం, అక్కడి ఇనుప బ్యారికేడ్లను తోసి వేస్తూ, వీరంగం సృష్టించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్పందించారు. తనను కలవాలంటూ ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దేవళ్ల రేవతికి ఫోన్‌కాల్ వెళ్లినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన దేవళ్ల రేవతి టోల్‌గేట్ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. టోల్‌గేట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఇనుప బ్యారికేడ్లను పక్కకు లాగి పడేశారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. వీరంగం సృష్టించారు. ఆమె దురుసుగా ప్రవర్తించిన వీడియోలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కొన్ని జాతీయ స్థాయి న్యూస్ ఛానళ్లలోనూ దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాలు ప్రసారం అయ్యాయి. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ విమర్శలకు అవకాశం లేకుండా చేయడానికి దేవళ్ల రేవతిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి రావడం తప్పకపోవచ్చని కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు సైతం బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య ఆమె ఈ సాయంత్రం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకోనున్నట్లు చెబుతున్నారు. నడిరోడ్డు మీద వీరంగం సృష్టించడానికి గల కారణాలపై పార్టీ అగ్ర నాయకత్వం ఆరా తీస్తోందని అంటున్నారు. తొలుత ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయవచ్చని సమాచారం. ఈ నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం లభించకపోతే.. వేటు వేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

కొత్తగా వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారామె. విజయవాడకు బయలుదేరి వెళ్తూ మార్గమధ్యలో కాజా టోల్‌గేట్ వద్ద ఆమె ఫీజు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించారు. దీనితో టోల్‌ప్లాజా సిబ్బంది ఆమె కారును అడ్డుకున్నారు. టోల్ ఫీజు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె అంగీకరించలేదు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బ్యారికేడ్లను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి సిబ్బంది వినిపించుకోలేదు. ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. దీనితో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇనుప బ్యారికేడ్లను తోసి పక్కన పడేశారు. తనతో వాగ్వివాదం చేసిన ఉద్యోగి చెంప పగులగొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com