ఆయుర్వేదం చెప్పే ఆరోగ్య చిట్కాలు..

- December 25, 2020 , by Maagulf
ఆయుర్వేదం చెప్పే ఆరోగ్య చిట్కాలు..

ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి.. ఎవరిమీదా ఆధారపడకూడదు.. ఏ అనారోగ్యం దరిచేరకూడదు.. ఆశయం పెద్దదే కానీ ఆచరణ కష్టంగా ఉంటుంది. అయితే అదేమంత కష్టం కాదు అంటోంది ఆయుర్వేద వైద్యం. మనసుకి మంచి ఆలోచనలు ఎలాగో.. శరీరంలో మలినాలు సాధ్యమైనంత తక్కువగా ఉండాలని చెబుతోంది. అంతేకాదు శరీరంలో పేరుకున్న మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని అంటోంది. ఆరోగ్యాన్నందించే ఆరు ముఖ్యమైన సూత్రాల గురించి చెబుతోంది ఆయుర్వేదం. మరి వాటి గురించి తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం మీ సొంతం.

1. బెడ్ మీదే ఉండి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టే బదులు ఓ పది నిమిషాలు ఎండ పడే ప్రాంతానికి వచ్చి అక్కడ ఛాటింగ్ చేయండి.. సూర్య కిరణాలు మీ మేనుని తాకి కావలసిన డి-విటమిన్ అందిస్తుంది. శరీరం కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆ సమయంలో పడే సూర్య కిరణాలు మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే బ్రష్‌‌కి ముందే ఓ గ్లాస్ వేడినీళ్లు తాగితే శరీరంలో పేరుకున్న మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇది తప్పనిసరిగా మీ దినచర్యలో భాగం చేస్తే సగం ఆరోగ్య సమస్యలు తీరినట్లే.

2. సాయింత్రం వీచే చల్లని గాలిలో కొంత సమయం గడపాలి. చల్లని గాలి స్పర్శ శరీరానికి టానిక్‌లా పనిచేస్తుంది. ఓ గంట వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో మలినాలు చేరకుండా ఉంటాయి. అస్వస్థతకు గురైన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందు నుంచి మంచి అలవాట్లు పెంచుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా నివారించొచ్చు.

3.సమయానికి ఆహారం తినకపోగా, ఎప్పుడు పడితే అప్పుడు తినడం సరికాదు.. శీతల పానీయాలు, కాఫీ, టీలు మితిమీరి తాగకూడదు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు చేయవు.

4.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ఓ చక్కని చికిత్స. లంకణం పరమౌషధం అని ఆయుర్వేదం చెబుతోంది. జీర్ణవ్యవస్థకు అప్పుడప్పుడూ విశ్రాంతి ఇవ్వాలి. తరచూ ద్రవపదార్థాలు, పండ్లను తీసుకుంటూ ఉపవాసాన్ని ఆచరించాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న మలినాలు తొలిగిపోతాయి. నీరు కూడా తగినంత తీసుకోవాలి. మంచిది కదా అని మించి తీసుకుంటే దాని వల్ల చెడే ఎక్కువగా జరుగుతుందని డాక్టర్లు అంటారు.

5.తీసుకునే ఆహారం మితంగా ఉండాలి. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేంత వరకు మళ్లీ తినకుండా ఉండడం ఉత్తమం.

6.అనారోగ్య హేతువులైన మద్యపానం, కూల్ డ్రింకులు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవనశైలి మనిషిని రోగాల బారిన పడేస్తుంది. షుగర్, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌లు, నిద్రలేమి ఇలా ఒకటేమిటి ఎన్నో అనారోగ్య సమస్యలు. దీనికి తోడు ఖరీదైన వైద్యం. అందుకే ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం. చికిత్స కంటే నివారణ మేలనే సూత్రాన్ని మర్చిపోకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com