విజయవాడ లో 'సీఐపీఈటీ' ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

- December 28, 2020 , by Maagulf
విజయవాడ లో \'సీఐపీఈటీ\' ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

విజయవాడ:ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగించే విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్లాస్టిక్ ద్వారా జరిగే నష్టం కంటే, ప్లాస్టిక్ వినియోగం విషయంలో ప్రజల వైఖరే మరింత సమస్యాత్మకంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (సీఐపీఈటీ)ని ఉపరాష్ట్రపతి సందర్శించి శిక్షణ తీసుకుంటున్న విద్యార్ధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రారంభాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, తాను సహచర మంత్రి అనంత కుమార్ తో మాట్లాడి అర్ధిక మంత్రిని ఒప్పించి శంకుస్థాపన చేసిన సంస్థ నేడు పరిఢవిల్లి ఉపాధి ఫలాలను అందిచటం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. స్కిల్ ఇండియా సాకారం కావాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి రూపు సంతరించుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు.

 విజయవాడ సిప్పెట్ నష్టాల నుంచి లాభదాయక సంస్థగా చేసిన ప్రయాణం స్పూర్తి దాయకమన్న ఉపరాష్ట్రపతి, స్కిల్ ఇండియా సాకారానికి ఇతర సంస్థలు సహకరిస్తాయన్నారు. దేశంలోని అనేక ప్రఖ్యాత సంస్థల్లో విజయవాడ సిప్పెట్ విద్యార్ధులు ఉన్నత స్థాయిల్లో ఉద్యోగాలు సాధించారని తెలిసి సంతోషించానన్నారు. ఈ నెలలో ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉందని శిక్షణనిచ్చి ప్రోత్సాహాన్ని అందిస్తే అత్యున్నత స్థానాలకు చేరుకోగలరని సత్య నాదెళ్ల లాంటి వారి ఉదాహరణలున్నాయని అన్నారు. సిప్పెట్  దేశ ఉన్నతిలోనే కాదు ప్రపంచ పురోగతిలోనూ భాగస్వామ్యం వహిస్తోందని అన్నారు.

పాలిమర్లను అద్భుతమైన పదార్థాలుగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి, వీటి ద్వారా జీవన ప్రమాణాల్లో సానుకూలమైన మార్పు వచ్చిందన్నారు. తక్కువ బరువు, ఎక్కువ మన్నిక కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాలిమర్లు ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. పాలిమర్ల వైవిధ్యత, ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనల పురోగతి, తక్కువ ధరకే తయారీ మొదలైన వాటి కారణంగా, వివిధ రంగాల్లో సంప్రదాయ పధార్థాల వినియోగానికి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మారుతోందని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో ప్లాస్టిక్ ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కీలకంగా మారిన పీపీఈ కిట్లు, మెడికల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ల్లో ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి వినియోగించడం అభినందనీయమన్నారు. ఐవీ ట్యూబ్‌లు, టిష్యూ ఇంజనీరింగ్, ఇంప్లాంట్స్, ఇన్సులిన్ పెన్‌ల వంటి వివిధ వైద్యపరికరాల తయారీలో పాలిమర్ పదార్థాలను విస్తృతంగా వాడుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 30వేలకు పైగా ఉన్న ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 40 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. భారతదేశంలో ప్రతి వ్యక్తి ఏడాదికి దాదాపుగా 12 కిలోల పాలిమర్లను వినియోగిస్తున్నారని, దీని ద్వారా ప్రపంచంలో పాలిమర్ల వినియోగదారుల జాబితాలో భారత్ తొలి-5 స్థానాల్లో ఉందన్నారు.

8శాతం వృద్ధితో పాలిమర్లకు డిమాండ్ పెరుగుతోందన్న ఉపరాష్ట్రపతి, ఈ అంచనాల ప్రకారం ప్రపంచ పెట్రోకెమికల్ రంగం 2025 నాటికి 958.8 బిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.7కోట్ల కోట్లు) కు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కారణంగా తర్వాతి తరాలకు పెట్రోకెమికల్ రంగంలో పరిశోధనల, స్వదేశీ సాంకేతికత వృద్ధికి సంబంధించిన ఓ ప్రోత్సాహభరితమైన వాతావరణ సష్టి జరుగుతుందని తెలిపారు.

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి ఎదురౌతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ‘త్రీ ఆర్‘ (రెడ్యూస్-తగ్గించడం, రీయూజ్-పునర్వినియోగం, రీసైకిల్) సూత్రం పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పక్కనపెట్టడమే సమస్యకు పరిష్కారం కాదన్న ఉపరాష్ట్రపతి, బాధ్యతాయుతంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ, సరిగా రీసైకిల్ అయ్యేలా చూడాలన్నారు.

స్వచ్ఛభారత్ ఉద్యమం ఎలాగైతే దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చిందో,  అదే తరహాలో ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ విషయంలోనూ ప్రజాఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ప్రచార, ప్రసార సాధనాలు, పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ఉద్యమకారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

2023 కల్లా ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్, 6.5 శాతం వృద్ధిరేటుతో 53.72 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.3.9లక్షల కోట్లు) చేరుకుంటుందన్న మార్కెట్ అంచనాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, నూతన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చెత్త నిర్వహణ ఓ సువర్ణావకాశంగా మారనుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఉద్దేశించి.. గువాహటిలో ఆదర్శ ప్లాస్టి్క్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఐపీఈటీని ఉపరాష్ట్రపతి అభినందించారు.

ప్రస్తుతం భారతదేశ ప్లాస్టిక్ ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, ఇది మన ప్లాస్టిక్ ఉత్పత్తుల రంగంలో అభివృద్ధికి బాటలు వేస్తోందని తెలిపారు. వివిధ కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయడంతోపాటు 50 కీలక పరిశోధనలను పూర్తిచేయడంతోపాటు 12 పేటెంట్లు పొందిన సీఐపీఈటీని హృదయపూర్వకంగా అభినందించారు. భారతదేశంలో 65 శాతానికి పైగా జనాభా 35 ఏళ్ల లోపువారున్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. దేశ యువశక్తికి పదునుపెట్టి.. వారి నైపుణ్యాన్ని పెంచడంతోపాటు వారికి సరైన అవకాశాలు కల్పించేదిశగా ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ప్రైవేటు రంగం కూడా తనవంతు పాత్ర పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ దర్మధాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు కెమికల్స్ మరియూ పెట్రో కెమికల్స్ జాయింట్ డైరెక్టర్ కాశీనాధ్ ఝా సిప్పెట్ సంస్థ డైరెక్టర్ జనరల్ నాయక్, విజయవాడ సిప్పెట్ నిర్వాహకులు శేఖర్ సహా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com