యువతరంలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి

- December 30, 2020 , by Maagulf
యువతరంలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి

బెంగళూరు:సామాన్య ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చడమే శాస్త్ర, సాంకేతికతల అంతిమ లక్ష్యం కావాలని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ దిశగా శాస్త్ర, సాంకేతికత విద్యాసంస్థలు, ప్రయోగ కేంద్రాలు, మరింత సృజనాత్మకత, సాంకేతికత పురోగతిని ప్రజలకు చేరవేయడంపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. భారతదేశ యువశక్తి సామర్థ్యాలకు నైపుణ్యమనే పదును పెంచుతూ.. భవిష్యత్ భారత, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వారిలో శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతికత, అధునాతన  పద్ధతులపై ఆసక్తిపెంపొందించేందుకు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు.
మంగళవారం, బెంగళూరులోని హోస్పేటలోని భారతీయ ఖగోళ విజ్ఞాన సంస్థ (ఐఐఏ) విభాగమైన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఆర్ఈఎస్‌టీ)ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంజీకే మీనన్ లేబొరోటరీ ప్రయోగశాలను, 2 మీటర్ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పరిశోధనకు సంబంధించిన రెండు నూతన సదుపాయాలు.. ఎన్విరాన్‌మెంట్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్‌ను, టీఎంటీ ఆప్టిక్స్ ఫాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఏ సమాజాభివృద్ధికైనా ధృవీకృత వాస్తవాలు, విస్తృత పరిశోధనల ఆధారిత శాస్త్రీయ విజ్ఞాన పునాదులే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన కేంద్రాలు.. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సంకల్పించిన ఆత్మనిర్భర భారత నిర్మాణానికి రానున్న రోజుల్లో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి శాస్త్రీయ విజ్ఞానం, అంతరిక్ష శాస్త్రం, గణితం మొదలైనవాటిని విరివిగా వినియోగించిన చరిత్ర ఉందని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ఆ ఘనమైన వారసత్వాన్ని భారతదేశం కొనసాగిస్తూ వస్తోందని, ఇకపైనా మరింతగా తన సత్తాను అంతర్జాతీయ వేదికపై చాటుకోవాలని సూచించారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక  కాలం వరకు అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని తెలిపారు.

థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణం కోసం.. శాస్త్రీయ విజ్ఞాన సంస్థలు, పరిశోధన కేంద్రాల అంతర్జాతీయ కూటమిలో అమెరికా, జపాన్, కెనడా, చైనాలతో కలిసి భారతదేశం భాగస్వామ్య దేశంగా ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ, మూడు బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో భారతదేశానికి 10 శాతం భాగస్వామ్యం ఉందని తెలిపారు. 2030వ దశకం ప్రారంభం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులలో దాదాపు 90 విభాగాల్లో భారత భాగస్వామ్యం ఉందన్నారు. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించిన ఉపరాష్ట్రపతి, జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ఆప్టిక్స్ వ్యవస్థలో మనవారు భాగం కావడం సంతోషకరమన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన డీఎస్టీ, డీఏఈ లను కూడా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 
భారతదేశ మూల సిద్ధాంతమైన ‘వసుధైవ కుటుంబం’ భావనకు ఈ ప్రయోగాలకు మరింత ఊతమిస్తున్నాయన్న ఉపరాష్ట్రపతి, మానవాళి మంచికోసం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో భారతదేశం పాలుపంచుకోవడం, భారతీయులుగా మనమంతా గర్వించదగిన అంశమని పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటే  అవకాశం కల్పించడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు వీలుకలుగుతుందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశం వేగవంతమైన పురోగతిని కనబరుస్తోందన్న ఆయన, ప్రపంచ ఆర్థిక శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదుగుతున్న భారత్ శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ అదే వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఇస్రో స్పేస్ మిషన్ ‘మంగళయాన్’ ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ.. త్వరలోనే సూర్యునిపై పరిశోధనలకు గానూ ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందన్నారు. ఇలాంటి ప్రయోగాల ఫలితాలనుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందుతూ.. తమలోని శాస్త్రీయ తృష్ణను పెంపొందించుకోవడంతో పాటు, ఈ రంగంలో పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు.

వ్యక్తిత్వ నిర్మాణం దిశగా విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, మాతృభాష ప్రాధాన్యతను ఎవరూ విస్మరించకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో మాతృమూర్తిని, మాతృదేశాన్ని, మాతృభాషను, గురువును మరిచిపోవద్దని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి కూడా  తానెక్కడ ఉన్నా దేశాభివృద్ధికోసం ఇతోధికంగా కృషిచేయడాన్ని మరిచిపోవద్దని, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు కూడా ‘అక్కడ నేర్చుకుని, సంపాదించుకుని.. తిరిగి మాతృదేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడికొచ్చి సమాజ పురోగతికి పాటుపడాలని సూచించారు.

కరోనా మహమ్మారి సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలకన్నా భారతదేశం తక్కువ ప్రభావానికి గురైందన్న విషయాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ఇక్కడి ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగానే కరోనాను ఎదుర్కోగలిగామన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలిని ప్రశంసించారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న ఆయన, యువత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు యోగ, వ్యాయామం చేస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక హోంశాఖ  మంత్రి  బసవరాజ్ బొమ్మై, ఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం, ఐఐఏ డీన్ ప్రొఫెసర్ జీసీ అనుపమ, ఐటీఎంటీ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డితోపాటు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com