పాప కు జన్మనిచ్చిన అనుష్క..ఆనందంలో విరాట్

- January 11, 2021 , by Maagulf
పాప కు జన్మనిచ్చిన అనుష్క..ఆనందంలో విరాట్

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విటర్ వేదికగా తెలిపాడు. మా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నాడు.‘‘ఈ రోజు మధ్యాహ్నం మాకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నా’’ అని విరాట్ ట్వీట్ చేశాడు.

‘జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ విరుష్క జోడీ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఐపీఎల్‌ సమయంలో కోహ్లీతో కలిసి అనుష్క దుబాయ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు కోహ్లీ బయలుదేరగా, అనుష్క స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే తన భార్య ప్రసవ సమయంలో తోడుగా ఉండాలని పితృత్వ సెలవులపై విరాట్‌.. తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, విరుష్క ఒక యాడ్‌ షూటింగ్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి ప్రయాణం ప్రేమగా మారింది. 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనుష్క గర్భవతి అయిన దగ్గరి నుంచి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా ఇరువురు అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com