బాత్రూమ్ లు కడిగిన టీమిండియా క్రికెటర్లు..

- January 13, 2021 , by Maagulf
బాత్రూమ్ లు కడిగిన టీమిండియా క్రికెటర్లు..

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకి కరోనా రూపంలో కష్టాలు మొదలయ్యాయ్. ఏ ప్లేయర్ కైనా కరోనా వచ్చిందేమో అనుకుంటారామో. ఎవరికి కరోనా రాలేదు గానీ...దాని వల్ల కష్టాలు మాత్రం వచ్చాయ్. ఈ నెల 15 నుంచి 19 వరకూ బ్రిస్బేన్ లో చివరి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. మంగళవారం టీమిండియా అక్కడికి చేరుకుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్తో .. స్టేడియానికి 4 కిమీ దూరంలో ఉన్న సోఫిటెల్ అనే ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌ని పూర్తిగా టీమిండియాకి కేటాయించారు. కానీ.. క్రికెట్ ఆస్ట్రేలియా అతి జాగ్రత్త కారణంగా.. ఆ హోటల్‌లో ఏ సౌకర్యాన్ని భారత క్రికెటర్లు వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో.. చివరికి బాత్రూమ్‌లను కూడా భారత క్రికెటర్లే శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా.. భారత ఆటగాళ్లు ఫైవ్‌స్టార్ హోటల్లో ఖైదీలుగా ఉంటున్నారు. ఎంతలా అంటే ఈ హోటల్లో భారత జట్టు తప్పా మరెవరూ లేరు.భారత క్రికెటర్లు బయో- సెక్యూర్ బబుల్‌లో ఉండగా.. వారితో ఎవరికీ ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు.

దీంతో హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ చేసే సిబ్బందిని కూడా హోటల్ నుంచి పంపించేశారు. అలానే రెస్టారెంట్, జిమ్‌ రూమ్‌లకు లాక్ చేసేయగా.. స్విమ్మింగ్‌ పూల్‌‌ని కూడా వాడుకునేందుకు వీలు లేకుండా చేశారు. ఫుడ్ కూడా ఆ హోటల్‌కు సమీపంలో ఉన్న భారత రెస్టారెంట్ నుంచి తెప్పించి ఓ ఫ్లోర్‌లో ఉంచుతున్నారు. దాంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆటగాళ్లు బాత్రూమ్‌లు కడుక్కోవడంతో పాటు అన్ని పనులు చేసుకుంటున్నారు.

" గదుల్లో బందీలయ్యాం. మా బెడ్స్ మేమే సర్దుకుంటున్నాం. బాత్రూమ్‌లు కడుక్కుంటున్నాం. సమీప భారత రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించి ఓ ఫ్లోర్‌లో పెడుతున్నారు. మా ఫ్లోర్ దాటి వెళ్లలేని పరిస్థితి ఉంది. హోటల్ మొత్తం ఖాళీగా ఉంది. కఠిన నిబంధనల కారణంగా హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్, జిమ్‌ను కూడా వాడుకోవడం లేదు. హోటల్లోని రెస్టారెంట్స్, కేఫ్స్ అన్నీ మూసేశారు." అని జట్టుకు సంబంధించి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితిపై టీమ్‌మేనేజ్‌మెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. కనీస సౌకర్యాలు కూడా లేవని తెలియజేసింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆస్ట్రేలియా టీమ్ భారత్‌కు వచ్చినప్పుడు బీసీసీఐ ఇలాగే చూసుకుంటుందా..? హోటల్‌లో కనీస వసతులు కూడా ఆటగాళ్లకి ఇవ్వకపోతే ఎలా..? అని ప్రశ్నల వర్షం కురిపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com