కనిపించకుండాపోయిన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు 'జాక్‌ మా' జాడ తెలిసిందోచ్

- January 20, 2021 , by Maagulf
కనిపించకుండాపోయిన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు \'జాక్‌ మా\' జాడ తెలిసిందోచ్

బీజింగ్‌: చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్‌ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌ నుంచి ఆయన బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. చైనా బ్యాంకుల తీరును ఎండగట్టిన నాటి నుంచి జాక్‌ మా బహిరంగంగా కనిపించలేదు. ఇక ఆయన నిర్వహించే ‘ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌’ షోకు కూడా హాజరు కాలేదు. దాంతో జాక్‌ మా మిస్సింగ్‌ అంటూ రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వ్యతిరేకంగా మాట్లడటంతో జిన్‌పింగ్‌ ఆయనను ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తాయి. ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. జాక్‌ మా కనిపించారు.

బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేసిన జాక్‌ మా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు. ఇక జాక్‌ మా వీడియో కాన్ఫరెన్స్‌కు సంబందించి వీడియో తొలుత ఓ లోకల్‌ బ్లాగ్‌లో ప్రచారం కాగా.. ఆ తర్వాత మీడియా, సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. దాంతో ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెర పడింది.

ప్రభుత్వంపై విమర్శలతో వివాదం..
చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్‌ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కణ్నుంచి జాక్‌ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌  ఐపీవో (37 బిలియన్‌ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్‌ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com