రఫేల్ విమానాలు.. భారత్‌కు యూఏఈ సహాయం!

- January 21, 2021 , by Maagulf
రఫేల్ విమానాలు.. భారత్‌కు యూఏఈ సహాయం!

న్యూఢిల్లీ: రఫేల్ విమానాల తరలింపులో భారత్‌కు సహాయం చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. రఫేల్ విమానాలు గాల్లోనే ఉండగానేన ఇంధనం నింపే విషయమై సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఫ్రాన్స్ బోర్డో-మెరిన్యా వైమానిక స్థావరం నుంచి బయలుదేరనున్న మరో మూడు రఫేల్ విమానాలు త్వరలో నేరుగా భారత్‌కు చేరుకోనున్నాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎక్కడా విరామం లేకుండా సాగే ఈ ప్రయాణంలో భాగంగా ఫైటర్ ప్లేన్లు గాల్లో ఉండగానే ఇంధనం నింపాల్సి ఉంటుంది. దీంతో.. యూఏఈ ఎయిర్ బస్ ట్యాంకర్‌ను పంపించనుంది. దీని ద్వారా రఫేళ్లకు మార్గమధ్యంలోనే ఇంధనం నింపనున్నారు(రీఫ్యూలింగ్). ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా గత ఏడాది ఐదు రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడా ఆగకుండా సాగిన ఈ ప్రయాణంలో రఫేల్ యుధ్ధవిమానాలకు గాల్లో ఉండగానే ఫ్రెంచ్ ఎమ్ఎమ్‌టీటీ విమానం ద్వారా ఇంధనం నింపారు.

రెండో విడతలో మరో మూడు విమానాలు భారత్‌కు రానున్నాయి. ఈమారు రీఫ్యూలింగ్ చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. యూఏఈ భారత్‌కు ఇటువంటి సహకారం అందించడం ఇదే ప్రథమమని, ఇరు దేశాల మధ్య బలపడుతున్న దౌత్యబంధానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ప్రభుత్వం హయాంలో భారత్-అరబ్ దౌత్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్ విమానాల తరలింపులో యూఏఈ అందిస్తున్న సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com