జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి

- February 11, 2021 , by Maagulf
జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి

హైద‌రాబాద్: గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి అధికారికంగా ప్ర‌క‌టించారు. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌తో పాటు కార్పొరేట‌ర్ల‌కు శ్వేతామ‌హంతి శుభాకాంక్ష‌లు తెలిపారు.

నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫ‌సీయుద్దీన్‌, గాజుల‌రామారం కార్పొరేట‌ర్ శేష‌గిరి ప్ర‌తిపాదించారు. డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త పేరును మ‌చ్చ‌బొల్లారం కార్పొరేట‌ర్ రాజ్ జితేంద‌ర్ నాథ్, కూక‌ట్‌ప‌ల్లి కార్పొరేట‌ర్ జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌ ప్ర‌తిపాదించారు. అనంత‌రం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి ఎన్నిక ప్ర‌క్రియ చేప‌ట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయ‌ర్‌ను ఎన్నుకున్నారు. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ఎంఐఎం మ‌ద్ద‌తు ఇచ్చింది.  

సంచ‌ల‌నాలు లేకుండా..
మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న‌ప్ప‌టికీ.. ఈ ప్ర‌క్రియ ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ అభ్యర్థులు ఎవ‌రు అనే అంశంపై గ‌త నాలుగైదు రోజుల నుంచి ఉత్కంఠ కొన‌సాగింది. ఇవాళ ఉద‌యం నుంచి మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త పేర్ల‌ను ప్ర‌తిపాదించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ అంద‌రిలో ఒక ర‌కమైన ఉత్కంఠ ఉండింది. మొత్తానికి ఎలాంటి హంగామా లేకుండా మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ పూర్త‌యింది. 

సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు : మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి
గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా ఎన్నికైన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి కోసం అంద‌రి స‌ల‌హాలు స్వీక‌రిస్తాను అని పేర్కొన్నారు. న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తాను అని స్ప‌ష్టం చేశారు. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూర‌మైన వెళ్తాను అని తేల్చిచెప్పారు. మేయ‌ర్‌గా, డిప్యూటీ మేయ‌ర్‌గా ఒకేసారి ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని విజ‌య‌ల‌క్ష్మి పేర్కొన్నారు.

మేయ‌ర్ ప్రొఫైల్ : గద్వాల విజయలక్ష్మి(బంజారాహిల్స్‌)
వయస్సు: 56
భర్త: బాబీరెడ్డి
విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
కులం: మున్నూరు కాపు (బీసీ)

మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైద‌రాబాద్‌లోని హోలీ మేరి స్కూల్‌లో పూర్తిచేశారు. రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్‌ ఉల్‌ లూమ్‌ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. 

వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్‌ అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు.

డిప్యూటీ మేయ‌ర్ ప్రొఫైల్ : మోతె శ్రీలత(తార్నాక‌)
వయస్సు: 49
భర్త: మోతె శోభన్‌రెడ్డి
పిల్లలు: రాజీవి, శ్రీతేజస్వి
విద్యార్హత: బీఏ
వృత్తి: 20 ఏండ్లుగా బొటిక్ నిర్వ‌హ‌ణ‌
రాజకీయ అనుభవం: కొంతకాలంపాటు టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com