ఆ ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయిన ఇలాన్ మస్క్

ఆ ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయిన ఇలాన్ మస్క్

టెక్సాస్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఇలాన్ మస్క్ ట్వీట్ల వల్ల ఆయన కంపెనీల షేర్లు అనేక సార్లు పడిపోవడం చూస్తూనే వచ్చాం. ఇప్పుడు మరోమారు ఆయన చేసిన ఓ ట్వీట్ వల్ల టెస్లా సంస్థ షేర్లు సోమవారం రోజున 8.6 శాతం పడిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. క్రిప్టోకరెన్సీకి ఈ మధ్య కాలంలో విలువ ఏ మేర పెరుగుతుందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ అమాంతం పెరుగుతూ పోతోంది. ఒక్క బిట్‌కాయిన్ విలువ మార్కెట్‌లో 50 వేల డాలర్లుగా ఉంది.

ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్, ఎథర్ క్రిప్టోకరెన్సీ ధరలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఇలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాత ఒక్కసారిగా టెస్లా షేర్లు పడిపోతూ వచ్చాయి. ఒకేసారి భారీ స్థాయిలో షేర్లు పడిపోవడంతో ఇలాన్ మస్క్ నికర ఆస్థుల విలువ కూడా 15.2 బిలియన్ డాలర్లు(రూ. 1.1 లక్ష కోట్లకు పైగా) తగ్గి 183.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇలాన్ ప్రపంచ కుబేరుడి మొదటి స్థానం నుంచి ఒక స్థానం కిందకు జారారు. అమెజాన్ సంస్థ అధినేత జెఫె బెజోస్ 186.3 బిలియన్ డాలర్లతో మళ్లీ ప్రపంచ కుబేరుడి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగా.. టెస్లా సంస్థ ఇటీవల 1.5 బిలియన్ డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్లను కొనుగోలు చేసింది. అంతేకాకుండా త్వరలో బిట్‌కాయిన్లను పేమెంట్ కింద తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Back to Top