చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి: ఉపరాష్ట్రపతి

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్:చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని, వారి ప్రాధాన్యతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో చర్చించుకుని మహిళలకు రిజర్వేషన్లపై ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. 

మాజీ ఎమ్మెల్యే, సామాజికవేత్త దివంగత ఈశ్వరీబాయి స్మారక స్టాంపును మంగళవారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈశ్వరిబాయి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. స్టాంప్ విడుదల లక్ష్యం ఆమె స్ఫూర్తిని ముందు తరాలకు పంచడమేనన్నారు. 
ఈ సందర్భంగా ఈశ్వరీబాయికి ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయ, సామాజిక రంగాలపై తనదైన ముద్రవేశారని గుర్తుచేసుకున్నారు.ప్రతిపక్ష నాయకురాలిగా నిరంతరం ప్రజావాణిని ఈశ్వరీబాయి వినిపించారన్న ఉపరాష్ట్రపతి, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, వ్యవసాయ కూలీలు, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనుల సమస్యలపై పోరాటం చేశారన్నారు.

పార్లమెంటు సహా రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ప్రస్తుత 17వ లోక్‌సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా 78 మంది మహిళా పార్లమెంటు సభ్యులున్నప్పటికీ, మొత్తం ఎంపీల సంఖ్యలో ఇది కేవలం 14 శాతమేనని ఆయన అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా లక్షల మంది మహిళలకు సాధికారత కలుగుతోందని పేర్కొన్నారు. 

చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు బదులుగా అంతరాయాలు, ఆందోళనకర ఘటనలు చోటుచేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, పార్లమెంటేరియన్లు, ఇతర ప్రజాప్రతినిధులు చర్చల విషయంలో ప్రమాణాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అర్థవంతమైన చర్చలే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సరికొత్త శక్తినిస్తాయన్న ఉపరాష్ట్రపతి, సభాకార్యక్రమాలకు తరచుగా అంతరాయం  కలిగించడం ద్వారా సాధించేది ఏదీ లేదని తెలిపారు. 

తరచుగా చట్టసభల్లో నెలకొంటున్న కొన్ని ప్రతికూల ఘటనలు, అంతరాయాలు ప్రజాతీర్పును అగౌరవపరచడమే అవుతుందన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడంలో తప్పులేదు. కానీ ప్రజాతీర్పును మాత్రం గౌరవించాల్సిందే’ అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. 
చట్టసభలు సమర్థవంతంగా పనిచేయడంలో అధికార, ప్రతిపక్షాలకు సమానమైన బాధ్యత ఉందన్నారు.

దేశ రక్షణ, అవినీతి నిర్మూలన, సామాజిక న్యాయం వంటి జాతిప్రయోజానాలతో ముడిపడిన అంశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. అభివృద్ధి వేగం పెంచడం, ప్రాజెక్టుల రూపకల్పనలో ఆలస్యాన్ని తగ్గించడం, నిధుల మళ్లింపు జరగకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు త్వరితగతిన నేరుగా చేరడం తదితర అంశాల్లోనూ ఏకాభిప్రాయ సాధన అత్యంత అవసరమన్నారు.

‘ప్రజలకు సాధికారత కల్పించడం, వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీని పెంచడం వంటి విషయాల్లోనూ అన్ని పార్టీలు కలిసి ఒకేవాణిని వినిపించాలి’ అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, పార్టీ నాయకుల ప్రవర్తన నియమావళి మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధుల విషయంలో అన్ని పార్టీలు కలిసి ఓ నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్టు చైర్‌పర్సన్ గీతారెడ్డి, ఎన్.సి.పి.సి.ఆర్, ఇండియా ట్రస్ట్ చైర్ పర్సన్ - ప్రొఫెసర్ శాంతా సిన్హా, మాజీ మంత్రి  కె.జానారెడ్డి, చీఫ్ పోస్టర్ జనరల్ ఎస్ రాజేంద్ర కుమార్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top