గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించండి : తెలంగాణ గవర్నర్

- March 23, 2021 , by Maagulf
గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించండి : తెలంగాణ గవర్నర్


హైదరాబాద్: గిరిజన ఉత్పత్తులకు మరింత మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. గిరిజనులు తమకే ప్రత్యేకమైన కొన్ని అద్భుతమైన వస్తువులను తయారు చేస్తారని వాటిని. సరైన రీతిలో మార్కెటింగ్ చేయాలని పిలుపునిచ్చారు. వారు తయారుచేసిన వస్తువులను, ఇతర అటవీ ఉత్పత్తులను మంచి మార్కెటింగ్ ద్వారా వారికి మంచి లాభాలు తీసుకురావాలని, దీని ద్వారానే వారు ఆర్థికంగా బలపడేందుకు అవకాశాలున్నాయని గవర్నర్ వివరించారు. డాక్టర్ తమిళిసై పుదుచ్చేరి నుండి ఈరోజు హైదరాబాదులోని రాజ్ భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం జాతీయ స్థాయిలోనే ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారం తీసుకోవాలని సూచించారు. గిరిజనుల జీవనోపాదులు పెంపొందించడానికి వారి ఆర్థిక  స్థితిగతులు పెంచడానికి అన్ని రకాలుగా కృషి చేయాలని అవసరమైతే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఈ ఉత్పత్తులు అందేలా చూడాలని వివరించారు. అదేవిధంగా గిరిజనుల  పోషకాహార అవసరాల  మెరుగు కోసం చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టు వివరాలను సమీక్షించారు. దీనికోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, రెడ్ క్రాస్ సంస్థల సహకారంతో గిరిజనుల పోషకాహార అవసరాలపై త్వరలోనే ఒక బేస్ లైన్ సర్వే నిర్వహించాలని  నిర్ణయించారు.

సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రేక్షకులు గాయపడడం పట్ల గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడినవారి కి సహాయం చేయడానికి రెడ్ క్రాస్ అవసరమైన సేవలు అందించాలని  ఆదేశించారు. హైదరాబాద్ రాజ్ భవన్ నుండి గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్, ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com