మయన్మార్‌పై చర్యలకు సిద్ధమైన అమెరికా!

- March 30, 2021 , by Maagulf
మయన్మార్‌పై చర్యలకు సిద్ధమైన అమెరికా!

వాషింగ్టన్‌: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. ఆ దేశంతో గతంలో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తిరగి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

బర్మా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ విపణికి అనుసంధానించే చర్యల్లో భాగంగా 2013లో ఇరు దేశాల మధ్య ‘ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ అగ్రిమెంట్’ అనే ఒప్పందం కుదిరింది. తాజాగా దీన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి కేథరీన్‌ టాయ్‌ ప్రకటించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బర్మా ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. 

అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్యం నిలిచిపోదు. కాకపోతే మయన్మార్‌పై అమెరికా కొన్ని ఆర్థికపరమైన ఆంక్షల్ని విధిస్తుంది. ఇప్పటికే తిరుగుబాటుకు వ్యతిరేకంగా సైన్యం ఆధ్వర్యంలో నడుస్తోన్న మయన్మార్‌ ఎకానమిక్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మయన్మార్‌ ఎకానమిక్‌ కార్ప్‌పై అగ్రరాజ్యంతో పాటు యూకే ఆంక్షల్ని విధించాయి. తాజాగా వీటిని మరికొన్ని రంగాలకూ విస్తరించనున్నారు. అలాగే కొన్ని సంస్థల్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నట్లు శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్‌ సాకీ తెలిపారు. 

మయన్మార్‌లో తయారయ్యే వెచ్చని దుస్తులు, గృహోపకరణాలకు అమెరికాలో మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించాలని నిర్ణయంతో ఈ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com