బహిరంగ ప్రసంగాల్లో భాషా మర్యాద పాటించాలి:ఉపరాష్ట్రపతి

- April 06, 2021 , by Maagulf
బహిరంగ ప్రసంగాల్లో భాషా మర్యాద పాటించాలి:ఉపరాష్ట్రపతి

గుజరాత్:బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి  ముప్పువరపు వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన మరియు బలమైన ప్రజాస్వామ్య భావనకు ఇది అత్యంత కీలకమని తెలిపారు. 

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా గుజరాత్ లోని చారిత్రక దండి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 రోజుల ‘దండి మార్చి’ ఉత్సవాల ముగింపు సభలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, ప్రత్యర్థుల పట్ల సైతం మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైన భాషను ఎల్లప్పుడూ ఉపయోగించే మహాత్మ గాంధీ నుంచి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని సూచించారు. గాంధీ మహాత్ముడు చెప్పిన అహింసా సిద్ధాంతం, శారీరక హింసకు మాత్రమే సంబంధించిన విషయం కాదని, మాటలు, ఆలోచనలు కూడా ఈ విషయాన్ని ప్రతిబింబించాలని తెలిపారు.
భారతదేశం స్వరాజ్యాన్ని సముపార్జించుకుని 75 సంవత్సరాల మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో 75 వారాల పాటు నిర్వహించ తలపెట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను మార్చి 21, 2021న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. 75 ఏళ్ళలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రతిబింబించే విధంగా ఈ పండుగను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు భారతదేశం కట్టుబడిన సనాతన సిద్ధాంతాల బలాన్ని తిరిగి మన కళ్ళకు కడుతాయని, ప్రపంచ యవనికపై శక్తివంతమైన దేశంగా భారత్ ను నిలబెట్టేందుకు మనమంతా కలిసి ముందుకు సాగే దిశగా ప్రేరేపిస్తాయని ఉపరాష్ట్రపతి తెలిపారు.


మహాత్మ గాంధీ ప్రారంభించిన దండి ఉప్పు సత్యాగ్రహం చరిత్ర గతిని మార్చిన క్షణంగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించే దిశగా ఈ సత్యాగ్రహ స్ఫూర్తి ప్రేరణనిస్తుందని తెలిపారు. అభివృద్ధి మార్గంలో కలిసి నడవగల ఈ సామర్థ్యం అనేక సానుకూల ఫలితాలను ఇచ్చిందన్న ఆయన, భవిష్యత్తుల్లో కూడా కలిసి కట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 


మహాత్మ గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయుల జీవితాలు మనం కలలు కంటున్న నవభారత నిర్మాణం దిశగా కలిసి పని చేయడానికి ప్రేరణిస్తాయన్న ఉపరాష్ట్రపతి, తమ సంపదను నలుగురికీ పంచే భారతదేశ స్ఫూర్తికి ఇది ప్రతిబింబమన్నారు. రాజ్యాంగ విలువలను, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించే స్ఫూర్తిని కలిగి ఉండడమే గాక, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ప్రజల సంక్షేమం దిశగా లోతైన నిబద్ధతతో దేశం ముందుకు సాగుతోందని తెలిపారు. 


ప్రపంచం మొత్తాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి, సరికొత్త ఆవిష్కరణల అవసరాన్ని నొక్కి చెప్పిందన్న ఉపరాష్ట్రపతి, ఈ సందర్భంలో భారతదేశ ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. పి.పి.ఈ. కిట్లు, సర్జికల్ గ్లౌజులు, వెంటిలేటర్లు, ఫేస్ మాస్క్ లు, వ్యాక్సిన్ వంటి వైద్య అత్యవసరాలను యుద్ధప్రాతిపదికన తయారు చేయడం ద్వారా ఆత్మనిర్భర భారత్ స్పూర్తికి వాస్తవ రూపం తీసుకొచ్చిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. 
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ ను భారతదేశం నిర్వహిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వసుధైవ కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సనాతన భారతీయ సిద్ధాంత స్ఫూర్తిని నొక్కి చెప్పడంలో భాగంగా, ప్రపం వ్యాప్తంగా అనేక దేశాలకు వ్యాక్సిన్లకు సరఫరా చేస్తున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇది అమృతమయమైన స్ఫూర్తి అని, భారతీయులకు శాశ్వతంగా లభించిన విశ్వదృష్టి అని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సైతం మహాత్ముని నైతిక నిష్ఠను భారతదేశం అనుసరిస్తోందని తెలిపారు. 

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని అమృత్ మహోత్సవ్ చాటి చెబుతోందన్న ఉపరాష్ట్రపతి, అమృత్ మహోత్సవ్ ఉద్దేశం స్వాతంత్ర్య పోరాట వీరుల నిస్వార్థ పోరాట స్ఫూర్తికి నివాళులు అర్పించడమే గాక, వారి ఆదర్శాలు, విలువలకు పునరంకితం కావడమని తెలిపారు. దండి మార్చి ఉత్సవంలో 25 రోజుల్లో 385 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన 81 మంది వాలంటీర్లను ఉపరాష్ట్రపతి అభినందించారు. 1930లో జరిగిన దండి మార్చిలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారన్న ఆయన,  యువతను, మహిళలను స్వరాజ్య ఉద్యమం దిశగా ప్రేరేపించడంలో ఉప్పు సత్యాగ్రహం పాత్ర కీలకమైనదని తెలిపారు. 

గాంధీజీ స్వరాజ్య సిద్ధాంత స్ఫూర్తిని వివరించిన ఉపరాష్ట్రపతి, రాజకీయపరమైన బానిసత్వం ఆర్థిక దోపిడీకి దారి తీయడమే కాకుండా, సాంస్కృతికంగా సమాజాన్ని నాశనం చేస్తుందని తాను విశ్వసిస్తానని తెలిపారు. అందుకే, మహాత్ముని సత్యాగ్రహం కేవలం రాజకీయ స్వాతంత్ర్య కోసమే జరగలేదని, దేశపు నైతిక, సాంస్కృతిక అభ్యున్నతి కోసమని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన, మతసామరస్యం, స్వదేశీ వస్తువుల వాడకం వంటి స్ఫూర్తిదాయకమైన అంశాలు ఇందులో భాగమని పేర్కొన్నారు. 
1931లో యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ రాసిన కథనాన్ని ఉటంకించిన ఉపరాష్ట్రపతి, ధనవంతులకు లభించే సదుపాయాలు, హక్కులు పేదలకు కూడా లభించే వరకూ సంపూర్ణ స్వరాజ్యం సాధించలేమని మహాత్ముడు అభిప్రాయపడ్డారని, అందుకే అందరి జీవితాల్లో రోజువారి అవసరమైన ఉప్పు, కనీస హక్కు అని తెలియజేసేందుకు సత్యాగ్రహాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 

గత 75 సంవత్సరాల్లో స్వాతంత్ర్య భారతం సాధించిన పురోగతిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడమే గాక, ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పెంచిన విషయాన్ని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించడమే గాక, ఆరోగ్య సూచికలను మెరుగు పరుచుకోగలిగామన్నారు. దేశంలో భౌతిక మరియు ఎలక్ట్రానికి మౌలిక సదుపాయాలు వంటివి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడం గర్వించదగినదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు, అక్కడి ప్రార్థనా మందిరలో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, దండి మార్చి ఉత్వవాల్లో పాల్గొన్న వాలంటీర్లతో సంభాషించారు. 1930 ఏప్రిల్ 4 రాత్రి గాంధీజీ గడిపిన సైఫీ విల్లాను సందర్శించారు. అనంతరం జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని సందర్శించారు. దేశ చరిత్ర గతిని మార్చిన ఉప్పు సత్యాగ్రహ స్మారకచిహ్నాన్ని సందర్శించడం, నాటి మహనీయుల త్యాగాలను గౌరవించే సందర్భమే గాక, ఉన్నతమైన భావోద్వేగ అనుభవంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ యొక్క భౌగోళిక సూచిక (జిఐ టాగ్) ఉత్పత్తులపై ప్రత్యేక ఎన్వలప్‌లను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు.
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, సిక్కిం ముఖ్యమంత్రి  ప్రేమ్ సింగ్ తమంగ్,కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)  ప్రహ్లాద్ సింగ్ పటేల్, పార్లమెంట్ సభ్యులు సి.ఆర్.పాటిల్, సబర్మతి ఆశ్రమ ట్రస్టీ  సుదర్శన్ అయ్యంగార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com