ప్రపంచాన్ని వణికిస్తున్న సెకండ్‌వేవ్‌ ...లక్షణాలు ఇవే!

ప్రపంచాన్ని వణికిస్తున్న సెకండ్‌వేవ్‌ ...లక్షణాలు ఇవే!

సెకండ్‌వేవ్‌లో కరోనా వేగంగా వ్యాపించటానికి వైరస్‌లో ఏర్పడిన ఉత్పరివర్తనాలే కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో బ్రెజిల్‌, యూకే స్ట్రెయిన్లు అధికంగా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఇవి శక్తిమంతంగా ఉండటంవల్లే వేగంగా వ్యాపిస్తున్నాయని, రోగుల్లో వ్యాధి లక్షణాలు కూడా భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. గతంలో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ళనొప్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఎవరికైనా ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 80% రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని, దీనివల్లనే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నదని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వైరస్‌ శరీరంలోని గుండె, కాలేయం, మూత్రపిండాలు, కండ్లకు నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కూడా కొందరు రోగుల్లో ఈ అవయవాలు కరోనావల్ల దెబ్బతిన్నట్టు గుర్తించారు. కొందరికి కంటిచూపు మందగించినట్టు వైద్యులు తెలిపారు.

ఇవీ కొత్త లక్షణాలు
పొత్తికడుపులో నొప్పి,వికారం, వాంతులు, జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం
నీరసం, కీళ్ల నొప్పులు.

9 లక్షల డోసులు సిద్ధం: శ్రీనివాసరావు
రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రమాదశాతం మొదటి వేవ్‌తో పోల్చితే తక్కువగా ఉండటం మంచి పరిణామమని చెప్పారు. రాబోయే 4 వారాలపాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం కోఠిలోని తన కార్యాయలంలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా టీకాలకు కొరత లేదని, కేంద్రం నుంచి మొత్తం 25 లక్షల డోసులు రాష్ర్టానికి రాగా, ఇప్పటివరకు 16 లక్షల డోసులు పంపిణీ చేశామని వివరించారు. మరో 9 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం డోసులు పంపిణీచేస్తున్నట్టు వెల్లడించారు.

రాబోయే రోజులు మరింత కీలకం
రాబోయే రోజులు మరింత కీలకం. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నది. ఒకటిరెండు నెలల్లో పీక్‌ స్టేజ్‌కి వెళ్లే అవకాశమున్నది. అప్పుడు పరిస్థితి కొంత క్లిష్టంగా ఉండవచ్చు. అర్హులైన వారందరూ వెంటనే టీకా వేసుకోవడం మంచిది. సెకండ్‌వేవ్‌లో కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖానికి మాస్కు లేకుండా బయటకు రావద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వేడుకలు, ఊరేగింపులు, పార్టీలకు దూరంగా ఉండాలి.

 - డాక్టర్‌ పరంజ్యోతి, నిమ్స్‌ పల్మనాలజిస్టు

Back to Top