అభివృద్ధికోసం పర్యావరణాన్ని పణంగా పెట్టలేమన్న ఉపరాష్ట్రపతి

- April 27, 2021 , by Maagulf
అభివృద్ధికోసం పర్యావరణాన్ని పణంగా పెట్టలేమన్న ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా సుస్థిరాభివృద్ధి సాధించడమే అత్యంత కీలకమైన అంశమని భారతదేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. ఈ దిశగా ముందుకెళ్లేందుకు వ్యాపారవేత్తలు స్వలకాలిక లాభాలపై కాకుండా దీర్ఘకాలంలో సుస్థిరత సాధన మీద దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.
 
మంగళవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ‘ఇండియన్ బీ-స్కూల్స్ లీడర్‌షిప్ కాంక్లేవ్ 2021’ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, పర్యావరణాన్ని పణంగా పెట్టి అభివృద్ధిసాధించాలనుకోవడం సరికాదని, భూతాపం పెరగడం, తద్వారా తలెత్తుతున్న ప్రకృతి విపత్తుల కారణంగా వ్యాపార వాతావరణం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్న విషయాన్ని విస్మరించరాదన్నారు.
 
‘ఇండియన్ బీ స్కూల్స్: స్థానిక, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను విలీనం చేయడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించడం’ అనే ఇతివృత్తంతో రెండ్రోజులపాటు జరగనున్న ఈ సదస్సును అసోసియేషన్ టు అడ్వాన్స్ కొలియేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఏఏసీఎస్‌బీ) అమెరికా, ఎడ్యుకేషన్ ప్రమోషన్ సొసైటీ ఫర్ ఇండియా (ఈపీఎస్ఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా వ్యాపార రంగ ప్రముఖులు, బీస్కూల్స్ డీన్స్, డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్ విద్యారంగంలో విధాన నిర్ణేతలు తదితరులు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బీస్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, నూతన అవకాశాల గురించి చర్చించనున్నారు.
 
కరోనా మహమ్మారి కారణంగా తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఏఏసీఎస్‌బీ, ఈపీఎస్ఐలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ పరిస్థితుల్లోనూ స్థానిక, అంతర్జాతీయ వ్యాపారంలోని ఉత్తమపద్దతులను నేర్చుకునేందుకు భారత బీస్కూల్ విద్యార్థులకు ఓ చక్కటి అవకాశం దొరికిందన్నారు.
 
భవిష్యత్ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక రంగంలో నాయకులు, మేనేజర్లు బీస్కూల్స్ నుంచే వస్తారని, వారంతా భారతదేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారని ఉపరాష్ట్రపతి అన్నారు. నేర్చుకునే విద్య సమాజాన్ని అవగతం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలని, ఇందుకోసం యువ మేనేజ్‌మెంట్ విద్యార్థులు స్థానిక గ్రామాల్లో పర్యటించి, గ్రామీణ భారత వ్యాపారాన్ని, సామాజిక సమస్యలను అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఆ సమస్యలకు పరిష్కారాలు సూచించడంపై దృష్టిసారించాలన్నారు.
వ్యాపారాభివృద్ధి ద్వారా జాతి నిర్మాణంలో కీలకభూమిక పోషించేందుకు యువ మేనేజర్లు సిద్ధంగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి, చక్కటి నడవడికను, విలువలను అలవర్చుకోవడం, సామాజిక దృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా చక్కటి, ఆనందకరమైన ప్రపంచాన్ని నిర్మించడం బిజినెస్ స్కూళ్ల ప్రాధాన్యత కావాలని సూచించారు.
 
ఉపాధి కల్పన గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఇండియా స్కిల్స్ రిపోర్టు - 2020 ప్రకారం భారతదేశంలోని ఎంబీఏ పట్టాపొందిన వారిలో 54శాతం మంది ఉపాధి పొందారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉన్నతవిద్యకోసం నమోదు చేసుకునేవారు తర్వాత వారిలో ఉపాధి పొందేవారికి ఉన్న అంతరాన్ని తగ్గించేదిశగా బీస్కూల్స్ చొరవతీసుకోవాలని ఆయన సూచించారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య పరస్పర సహకారం కారణంగా విద్యార్థులకు ప్రయోగపూర్వకమైన విద్యను అందిచేందుకు వీలవుతుందన్నారు. దీంతోపాటుగా విద్యార్థులకు ప్రారంభంనుంచే నాయకత్వ లక్షణాలు, పదిమందితో కలిసి పనిచేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో చొరవ తదితర అంశాలను కూడా నేర్పించడం ద్వారా భవిష్యత్తులో వారు విజయవంతమైన మేనేజర్లుగా ఎదిగేందుకు వీలవుతుందన్నారు.
స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని బీస్కూల్స్ కు అమెరికాలోని హార్వర్డ్, ఎంఐటీ వంటి సంస్థలు చాలా సహకరించాయన్న ఉపరాష్ట్రపతి, ప్రస్తుతం అమెరికాలోని అత్యుత్తమ బీస్కూల్స్ లోని అధ్యాపకులు, ఉన్నతస్థానాల్లో ఉన్నవారంతా భారత సంతతికి చెందిన వారు మరియు ఇక్కడ విద్యను అభ్యసించిన వారుండటం మనందరికీ గర్వకారణమన్నారు. ‘ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడానికి ఇదొక చక్కటి ఉదాహరణ’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు, విద్యార్థులు వర్చువల్ (అంతర్జాలం ద్వారా) పద్ధతిలో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి తలెత్తిందన్న ఉపరాష్ట్రపతి, హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాల కారణంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థులకు సూచలను ఇవ్వడంతోపాటుగా వారికి మార్గదర్శనం చేయడంపై బీస్కూల్స్ అధ్యాపకులు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అంతర్జాలం ద్వారా నేర్చుకోవడాన్ని ఇబ్బందిగా కాకుండా, భవిష్యత్తుకు అవసరమైన మార్పుగా విద్యార్థులు పరిగణించాలన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచన, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను కూడా ఒంటబట్టించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
ఈ కార్యక్రమంలో ఏఐసీటీఈ చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధే, ఈపీఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ జి.విశ్వనాథన్, ఏఏసీఎస్‌బీ ఆసియా-పసిఫిక్ ప్రాంత చీఫ్ ఆఫీసర్ డాక్టర్ జెఫ్ పెర్రీ, బిమ్స్‌టెక్ డైరెక్టర్ డాక్టర్ హరివంశ్ చతుర్వేదితోపాటు వివిధ దేశాల్లోని బీస్కూల్స్ ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com