శరత్‌కుమార్‌పై అవినీతి కేసు...

- March 04, 2016 , by Maagulf
శరత్‌కుమార్‌పై అవినీతి కేసు...

తమిళనాడులో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమత్తువ మక్కల్‌ కట్చి (ఎస్‌ఎంకే) వ్యవస్థాపకుడు శరత్‌కుమార్‌పై అవినీతి కేసు దాఖలవ్వడం సంచలనంగా మారింది. నడిగర్‌ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు రగిల్చిన చిచ్చు మరింత రాజుకున్నట్టు కనిపిస్తోంది. సంఘం పూర్వాధ్యక్షుడు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే శరత్‌కుమార్‌పై ప్రస్తుత కార్యవర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నడిగర్‌ సంఘం ట్రస్టు వ్యవహారాల్లో శరత్‌కుమార్‌పై అవినీతికి పాల్పడినట్టు ప్రస్తుత కార్యవర్గంలోని పూచ్చి మురుగన్, కార్తీలు గురువారం చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.అయితే తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని శరత్‌కుమార్‌పై తీవ్రంగా స్పందించారు. ఐక్యంగా ఉండాల్సిన తారల మధ్య రగలుతున్న ఈ వివాదంతో కోలీవుడ్‌ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 2006 నుంచి 2015 వరకు తొమ్మిదేళ్లు నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన శరత్‌కుమార్, ఆయన కార్యవర్గ సభ్యుల పనితీరుపై అసంతృప్తితో నడిగర్‌ సంఘం భవన నిర్మాణం ప్రధానాస్త్రంగా నాజర్‌, విశాల్‌, కార్తీ నేతృత్వంలోని యువ జట్టు ఎన్నికల్లో పోటీచేసి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పూర్వ కార్యవర్గం ఎస్‌పీఐ సినిమాస్‌తో చేసుకుని ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ఎస్‌పీఐతో ఒప్పందాన్ని రద్దు చేసినట్లు శరత్‌కుమార్ పత్రికాముఖంగా ప్రకటించి, పత్రాలను కూడా చూపించారు. కానీ, నడిగర్‌ సంఘం లెక్కలు శరత్‌కుమార్ తమకు అప్పగించలేదని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందని ప్రస్తుత కార్యవర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో గత బుధవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో శరత్‌కుమార్‌పై ఫిర్యాదు చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. ఆ మేరకు పూచ్చి మురుగన్, ఇతర సభ్యులు గురువారం చెన్నై పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అందులో శరత్‌కుమార్, రాధారవి, మునుపటి కార్యవర్గ సభ్యులు కోట్లాది రూపాయలు అవినీతి పాల్పడినట్లు పేర్కొన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com