కరోనా పై స్పందించిన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్
- May 19, 2021
న్యూఢిల్లీ: కరోనా.. కరోనా.. కరోనా.. ఈ కరోనా కల్లోలం ఎప్పట్లో ముగిసిపోతుంది? దీని అంతం ఎప్పుడు? మళ్లీ సాధారణ జీవితం చూడగలమా? ఈ ప్రశ్నలు ఇప్పుడు భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్తగా పని చేస్తున్న సౌమ్యా స్వామినాథన్‌ను ఇదే విషయమై అడిగితే ఆమె సూటిగా ఒక్క ముక్కలో సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం సమస్య జటిలంగా ఉందని, మహమ్మారి క్లిష్టదశకు చేరుకుందని చెప్పారు. రాబోయే 6 నుంచి 12 మాసాల కాలంలో ఏం చేయాలనేదానిపై మనం దృష్టి నిలపాల్సి ఉందని అన్నారు. ఇది చాలా గడ్డు దశగా ఉంటుందని అన్నారు. ఆ తర్వాతే మనం కరోనా తరిమివేత లేదా నియంత్రణ గురించి ఆలోచించగలమని సౌమ్య చెప్పారు. ఇంకా వైరస్ అంతిమంగా ఎలా రూపాంతరం చెందుతుందనేది కూడా ముఖ్యమని అన్నారు. టీకాల వల్ల కలిగే రోగనిరోధకత వ్యవధి, టీకాలు వివిధ రకాల వైరస్ రూపాంతరాల నుంచి ఎంతవరకు రక్షణ ఇవ్వగలవనే దానిపై కూడా అంతిమ అంచనా ఆధారపడి ఉంటుందని తెలిపారు. వైరస్ అంతం గురించి జోస్యం చెప్పడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త అంటున్నారు. 2021 చివరినాటికి ప్రతిదేశంలో, ప్రతి చోటా.. జనాభాలో కనీసం 30 శాతం మందికి టీకాలు పూర్తిచేయడం చాలా ముఖ్యమని సంస్థ భావిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కోవాక్స్ కార్యక్రమ లక్ష్యం ఇది. ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే కరోనా వైరస్ మరణాలు చాలావరకు తగ్గిపోవడం చూడగలుగుతామని ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో సౌమ్య చెప్పారు. ఆ తర్వాత 2022లో 60-70-80 శాతం సాధించగలమేమో చూడాలి. 2022 చివరినాటికి టీకాల కార్యక్రమం గరిష్ఠంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ లోగా సమిష్టి రోగనిరోధకత ఏమేరకు పెరుగుతుందో చూడాల్సి ఉంది. ఆ తర్వాతే కరోనా వ్యాధి సాధారణ జలుబు వంటి అన్ని ఇతర సాధారణ వ్యాధుల్లాగే మారుతుందని అన్నారు. అప్పుడిక కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ గడపడం సాధ్యమవుతుంది. అందుకే రాబోయే 6 నుంచి 18 మాసాల గడువు కీలకమైనదిగా భావిస్తున్నట్టు సౌమ్య వివరించారు. దీర్ఘకాలికంగా ఏం జరుగుతుందనేది జోస్యం చెప్పడం కష్టమని, మహమ్మారి కీలక దశకు అంతం అనేది ఉంటుందని మాత్రం చెప్పగలమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచస్థాయి సహకారం చాలాచాలా ముఖ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







